02-05-2024 12:14:51 AM
ప్రధాని మోదీ హెచ్చరిక
ఉగ్ర దేశాలకు సమాచారం కూడా ఇవ్వం
నయా భారత్‌లో ఇలాగే ఉంటుంది..
కాంగ్రెస్ వారిని ఉపేక్షించింది
పదేళ్ల కింద దేశంలో ఉగ్రవాదం
ముస్లిం సోదరీమణులకు ఎంతో చేశా
గాంధీనగర్ (గుజరాత్), మే 1: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ ఉపేక్షించేదని దుయ్యబట్టారు. ఉగ్రవాదంపై నయా భారత్ ఉపేక్షించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాద దేశాలకు ఎలాంటి సమాచారం ఇచ్చేది లేదని, ఉగ్రవాదులను దేశాల్లోనే మట్టుబెడుతామని హెచ్చరించారు. పదేళ్ల కింద దేశం ఉగ్రవాదంతో ఇబ్బందులు పడేదని, నయా భారత్‌లో అలా జరగదని చెప్పారు. ఉగ్రదేశాలకు కాంగ్రెస్ ఉత్తరాలు పంపుతూ కాలక్షేపం చేసేదని తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం గుజరాత్‌లోని సబర్‌కాంతా జిల్లా హిమ్మత్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ముస్లిం మహిళలు బాధితులు..
కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం వల్ల ముస్లిం మహిళలు తీవ్రంగా నష్టపోయారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు మన ముస్లిం సోదరీమణులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మీరు (కాంగ్రెస్) సుప్రీం కోర్టు చెప్పినా కూడా ముస్లిం సోదరీమణులకు ఎలాంటి రక్షణ కల్పించలేదు. ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలే కాదు.. వారి కుటుంబాలకు ఎంతో రక్షణ కలిగింది. కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేయలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఓటు బ్యాంకు గురించి ఆందోళన చెందను. ఎన్నికల్లో గెలవాలని నేను కోరుకోలేదు. ముస్లిం సోదరీమణుల జీవితాలు సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను. అందుకే ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేశాం’ అని మోదీ పేర్కొన్నారు.
రాహుల్‌కు జ్వరం పట్టుకుంది..
‘ను ముస్లిం సోదరీమణుల కోసం ఇవన్నీ చేయడంతో కాంగ్రెస్ రాకుమారుడికి జ్వరం పట్టుకుంది. నేను మూడో సారి ప్రధాని అయితే దేశం తగలబడి పోతుందని కాంగ్రెస్ చెబుతోంది. నేను మరోసారి ప్రధాని అయితే మాత్రం కాంగ్రెస్ ఆశలన్నీ కాలి బూడిదవుతా యి’ అని ఎద్దేవా చేశారు.‘ఇప్పుడేమో నేను అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను తీసేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో దేశం మొత్తం రాజ్యాంగాన్ని అమలు చేయలేకపోయింది. కశ్మీర్‌లో రాజ్యాంగాన్ని అమలు చేయలేకపోయింది. ఎంతో నిబద్ధతతో ఇదంతా మోదీ చేశారు’ అని ప్రధాని వివరించారు.