calender_icon.png 8 April, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మాటికీ మోదీ బియ్యమే!

06-04-2025 12:34:36 AM

  • రేషన్‌షాపుల్లో ప్రధాని ఫొటో పెట్టాల్సిందే
  • సన్నబియ్యం పంపిణీలో ఎవరి వాటా ఎంతో తేల్చాలి
  • హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్‌పై అక్రమ కేసు
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): తెలంగాణలోని రేషన్‌షా పుల్లో పంపిణీ చేస్తోంది ముమ్మాటికీ మోదీ బియ్యమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రేషన్ బియ్యం ఉచితంగా అందిస్తున్నది మోదీ సర్కారేనని.. అయినప్పటికీ కాంగ్రెస్ తామే సొంతంగా పంపిణీ చేస్తున్నట్లు డ్రామాలాడుతోందని విమర్శించారు. వడ్ల కొనుగోలు పేరుతో ప్రతి సీజన్‌కు సగటున రూ.10వేలకోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు. ఏటా సగటున రెండు సీజన్లకు కలిపి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేని స్పష్టం చేశారు. 

అయినా ప్రధాని ఫొటో ఎందుకు పెట్టరని నిలదీశారు. రేషన్‌షాపుల వద్ద ప్రధాని ఫొటో పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్‌కు దమ్ముంటే బియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఎంతనో.. రాష్ర్టం వాటా ఎంత అనే దానిపై రేషన్ షాపుల వద్ద డిస్‌ప్లే చేయాలని డిమాండ్ చేశారు.

హెచ్‌సీయూ విషయంలో అమానుషం..

హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ అమానుషంగా వ్యవహరించిందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకించిన యూనివర్సిటీ స్కాల ర్ రోహిత్‌పై దాడి చేసి జైలుకు పంపించారని.. అక్రమంగా ఆయుధాల కేసు పెట్టి రోహిత్ జీవితాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు.

విద్యార్థులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో భూములమ్మి రూ.20 వేల కోట్లు దోచుకుందని.. కాంగ్రెస్ అంతకుమించి దోచుకునేం దుకు భూముల మ్మేందుకు సిద్ధమైందన్నారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే..

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని.. డీలిమిటేషన్ పేరుతో రెండు పార్టీలు కలిసే చెన్నై మీటింగ్‌లో పాల్గొన్నాయని, త్వరలో రెండు పార్టీలు కలిసి ఇదే అంశంపై హైదరాబాద్‌లోనూ బహిరంగ సభ పెడుతున్నట్లు బండి తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాయని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మజ్లిస్‌కు మద్దతిస్తున్నాయన్నారు.