calender_icon.png 23 September, 2024 | 10:04 AM

అమెరికాలో ప్రధాని మోదీ

22-09-2024 12:11:03 AM

  1. ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులు
  2. క్వాడ్ సదస్సుకు హాజరయ్యేందుకు పయనం
  3. యూఎస్‌తో ద్వైపాక్షిక భేటీతో టూర్ స్టార్ట్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాకు ప్రధాని నరేంద్రమోదీ శనివారం చేరు కున్నారు. ఆయనకు ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగం గా మొదట మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. అనంతరం బైడెన్ నేతృత్వంలో విల్మింగ్‌టన్‌లో జరిగే క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు. 

సెప్టెంబర్ 22న న్యూయార్క్ నగరంలో నిర్వహించనున్న ప్రవాసులతో గెట్ టుగెదర్ కార్య క్రమానికి మోదీ హాజరుకానున్నారు. 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రస ంగిస్తారు. భారత్ నుంచి మోదీ బయలుదేరేముందు ఎక్స్ వేదికగా పలు అంశాలను ట్వీట్ చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్నా. బైడెన్‌తో భేటీ అవుతున్నా. ఈ సమావేశం ఇరుదేశాలతోపాటు ప్రపంచ ప్రయోజనాలకు ఉపయోగప డుతుంది అని పోస్ట్ చేశారు. 

ద్వైపాక్షిక భేటీతో మొదలు

మోదీ, బైడెన్ మధ్య జరిగే ద్వైపాక్షిక భేటీలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. అమెరికా నుంచి బిలియన్ డాలర్ల విలువైన 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు అంశంపైనా ఇరు నేతలు చర్చించున్నారు. భారత్, అమెరికా మధ్య అంతరిక్ష సహకారంపైనా కీలక ప్రకటన వెలువడే అవకాశముందని, దీని ఫలితంగా యాక్సియం మిషన్ ద్వారా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్ష యానం చేయనున్నారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత వార్షిక క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనీస్‌తో చర్చలు జరుపుతారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. ఈ సదస్సులో చైనాతో పాటు క్యాన్సర్ మూన్‌షాట్ అంశాలు కీలక ఎజెండా అని స్పష్టంచేశారు.

క్యాన్సర్ మూన్‌షాట్‌పై చర్చ

క్యాన్సర్ మూన్‌షాట్ రోగులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు క్యాన్సర్ పరిశోధన రంగాలపై దృష్టి సారిస్తుంది. ఇందుకోసం 21 సెంచరీ క్యూర్స్ చట్టం ద్వారా దీనికి నిధుల కేటాయింపుతో పాటు పెట్టుబడులు లభించేలా ఏర్పాట్లు చేశారు. ఈ చొరవతో రోగులు, పరిశోధకులు, వైద్యులు కలిసి పనిచేయడానికి, క్యాన్సర్ రోగులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడటం, వారి జీవన పరిస్థితిని మెరుగుపరచడం, క్యాన్సర్ నివారణ, గుర్తింపు, చికిత్స పద్ధతుల్లో పురోగతిని వేగవంతం చేయడం దీని లక్ష్యాలు.

ఒబామా ప్రభుత్వంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతని కుమారుడు బ్యూ బైడెన్ మెదడు క్యాన్సర్‌తో మరణించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆరో క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్ ఇనిషియేటివ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా గర్భాశయ క్యాన్సర్ నివారణ, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా గర్భాశయ క్యాన్సర్‌పై పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నాలుగు దేశాలు భేటీ అవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.