calender_icon.png 17 November, 2024 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీది మానసిక దౌర్బల్యం

11-09-2024 12:17:16 AM

దేవుడితో మాట్లాడుతానని పిచ్చి మాటలు

భారత్‌లో మత స్వేచ్ఛ కోసం కొట్లాడుతున్నాం

అమెరికా పర్యటనలో రాహుల్‌గాంధీ

సిక్కుల ఊచకోత కాంగ్రెస్ చరిత్రే: బీజేపీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానసికంగా కుప్పకూలిపోయారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తాను దేవుడుతో నేరుగా మాట్లాడుతున్నానని చెప్పటమే ఆయన మానసిక దౌర్బల్యానికి నిదర్శనమని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం వాషింగ్టన్ డీసీలోని జార్జిటౌన్ యూనివర్సిటీ, వర్జీనియాలోని హెర్న్‌డన్ యూనివర్సిటీలో మాట్లాడారు.

‘నేను నేరుగా దేవుడితో మాట్లాడగలను అని ఆయన (మోదీ) చెప్పుకోవటం మనకు తెలుసు. వాస్తవానికి అది ఆయన వైఫల్యం. మానసిక స్థిరత్వాన్ని కోల్పోయారు. నేను ప్రత్యేకం, విభిన్నం, దేవుడితో మాట్లాడుతాను అని ప్రధాని గొప్పలు చెప్పుకొంటున్నారని ప్రజలు అనుకొంటున్నారు. కానీ, అంతర్గతంగా అందులో ఆయన మానసిక దౌర్బల్యం కనిపిస్తున్నది’ అని రాహుల్‌గాంధీ అన్నారు.  

లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరుగలేదు

జూన్‌లో జరిగిన భారత లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరుగలేదని రాహుల్‌గాంధీ అభిప్రాయపడ్డారు. ‘అవి స్వేచ్ఛాయుత ఎన్నికలని నేను అనుకోవటం లేదు. పూర్తిగా నియంత్రిత వాతావరణంలో జరిగిన ఎన్నికలవి. పారదర్శకంగా ఎన్నికలు జరిగాయని నేను నమ్మటంలేదు. బీజేపీ 240 సీట్ల వరకు రాగలిగింది. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది’ అని పేర్కొన్నారు.

మత స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం

భారత్‌లో తాము మత స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని హెర్న్‌డన్ యూనివర్సిటీలో చర్చ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. ‘సిక్కు వ్యక్తి టర్బన్ ధరించే అవకాశం కోసం పోరాటం జరుగుతున్నది. సిక్కు వ్యక్తి కడ ధరించేందుకు, గురుద్వారాకు వెళ్లే అవకాశం కోసం పోరాటం జరుగుతున్నది. ఒక్క సిక్కులే కాదు. భారత్‌లో అన్ని మతాలు తమ నమ్మకాల కోసం పోరాడుతున్నాయి’ అని పేర్కొన్నారు. 

సిక్కుల ఊచకోత మీ పనే

మత స్వేచ్ఛపై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. 1984లో 3 వేల మంది సిక్కులను ఊచకోత కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఎదురుదాడి చేశారు. ‘ఢిల్లీలో 1984లో మూడు వేల మందిని ఊచకోత కోశారు. వారి టర్బన్‌లను తొలగించారు. జుట్టు, గడ్డం కత్తిరించారు. ఇదంతా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందన్న విషయాన్ని ఆయన (రాహుల్) చెప్పలేదు. రాహుల్ అవే మాటలు భారత గడ్డపై ఉండి మాట్లాడితే ఆయనపై కేసు వేసి కోర్టుకు లాగేవాన్ని’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.