calender_icon.png 27 September, 2024 | 4:53 PM

ఉద్యోగాలకు మోదీ గండం

27-09-2024 12:54:31 AM

  1. ఉద్యోగ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రధాని
  2. రాహుల్‌గాంధీ ఆగ్రహం

కర్నాల్, సెప్టెంబర్ 26: దేశంలో ఉద్యోగ వ్యవస్థను ప్రధాని నరేంద్రమోదీ ఒక పథకం ప్రకారం ధ్వంసం చేస్తున్నారని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కర్నాల్‌లోని అస్సధ్ సభలో ఆయన మాట్లాడారు. ‘హర్యానా యువత సొంత రాష్ట్రంలో సరైన ఉపాధి లేక భూములను అమ్ముకొని, అధిక వడ్డీలకు అప్పులు చేసి ఎంతో ప్రమాదకరమైన మార్గాల్లో ఇతర దేశాలకు వలస పోతున్నారు. అలా వెళ్లినవారు అక్కడ కూడా సరైన ఉపాధి లభించక ఎన్నో కష్టాలు పడుతున్నారు.

చిన్న ఇంట్లో 20 మంది నివసిస్తున్నారు. దశాబ్దాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు మరణిస్తే కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా స్వదేశానికి రాలేని దీన స్థితిలో ఉన్నారు. ఇటీవల నేను అమెరికా వెళ్లినప్పుడు చాలామంది నన్ను కలిసి వారి కుటుంబాలతో మాట్లాడించాలని కోరారు. తెల్లవారుజామున 4 గంటలకు నేను కొందరి కుటుంబాలతో మాట్లాడించే ఏర్పాట్లు చేశాను. అలాంటి భావోద్వేగ సన్నివేశాన్ని నేను జీవితంలో చూడలేదు. ఒక కుమారుడు తన తండ్రితో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకొన్న వీడియో మీరంతా చూడాలి.

దీనికంతటికీ కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కారణం. ఈ ప్రభుత్వాలు ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. మీ జీవనాధారమైన వ్యవసాయాన్ని లాగేసుకొనేందుకు మోదీ నల్లచట్టాలు తెచ్చారు. జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌కు నేను వెళ్లాను. అక్కడ యాపిల్ పండ్ల వ్యాపారాన్ని అదానీకి అమ్మేశారు. వారు (అదానీ) తీసుకొన్న కోట్ల రూపాయల లోన్లు మాఫీ చేశారు. మీ అప్పులు మాత్రం మాఫీ చేయలేదు’ అని విమర్శించారు.