calender_icon.png 21 February, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ నాపై పగబట్టిండు

02-05-2024 01:18:57 AM

ప్రశ్నించినందుకే నాపై కుట్ర కేసులు

ప్రధాని వెనుక ఈడీ, సీబీఐ, ఐటీ

ఈ ఎన్నికలు గుజరాతీల ఆధిపత్యానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు

నా వెనుక 4 కోట్ల ప్రజలున్నారు

కోరుట్ల సభలో సీఎం రేవంత్

జగిత్యాల, రంగారెడ్డి మే 1 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు రద్దు చేసి.. దేశాన్ని అంబానీ, అదానీలకు అమ్మేసే కుట్ర జరుగుతుందని, దాన్నే ప్రశ్నించినందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై పగబట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ, మోదీ నేరాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల జన జాతర బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్తు, రిక్షా, ఆటో కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి, గుజరాతీల ఆధిపత్యానికి మధ్య జరుగు తున్న పోరు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నదని, దానిని కాపాడేందుకు ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన నిలవాలని కోరారు. రాహుల్‌గాంధీకి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల కష్టసుఖాలు తెలుసని, ప్రజా సమస్యల పరిష్కారం ఆయన వల్లే సాధ్యమని స్పష్టంచేశారు. బీసీ జనగణన నిర్వహించి వారి రిజర్వేషన్ల ప్రకారం నిధులు, నియామాకాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 

రాజ్యాంగానికి బీజేపీ గండం

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తనపై ఎన్నో కేసులు పెట్టినా భయపడకుండా 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఆ పార్టీని బొంద పెట్టామని సీఎం రేవంత్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర పన్నిందని, ఆ కుట్రలను తెలంగాణ ప్రజలకు, దేశానికి వివరిస్తామని తెలిపారు. ‘రిజర్వేషన్ల రద్దు అంశంపై నేను మాట్లాడుతున్నందుకు ఢిల్లీ పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయాల చూశారు. ఇలాంటి కక్ష పూరిత పనులకు పూనుకుంటే తెలంగాణ ప్రాంతంలో నిజాం, రజాకర్లకు పట్టిన గతే బీజేపీకి పడుతుంది. బీజేపీ వెనుక ఈడీ, సీబీఐ, ఐటీ ఉంటే నా వెనుక తెలంగాణ రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలున్నారు’ అని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా వచ్చి తెలంగాణకు ఎం చేస్తారో చెప్పకుండా మత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జీవన్‌రెడ్డి తన 43 ఏళ్ల రాజకీయ జీవితం రైతులకు అంకితం చేశారని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడుతుందని, నియంతల కింద దేశం నలిగిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ ఐదేండ్లలో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజలు, రైతుల వెంట ఉంటానని ఆయన పేర్కొన్నారు. 

ఢిల్లీ పెత్తనానికి చెక్ పెడదాం

విభజన హామీలను అమలు చేయకుండా ఢిల్లీ పెద్దలు తెలంగాణలో అధికారం చెలాయించాలని కుట్రలు చేస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఈ నెల 13న కాంగ్రెస్‌కు ఓటు వేసి ఢిల్లీ సుల్తాన్‌లను డకౌట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లిలో బుధవారం రాత్రి కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొండ అయినా బండ అయినా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక గుద్దుకే తుంకలు తుంకలు చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే చందానగర్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు మెట్రోను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. రూ. లక్ష కోట్లతో మూసీనదిని సుందరీకరిస్తామని ప్రకటించారు.