calender_icon.png 23 December, 2024 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రరాజ్యంలో మోదీ

22-09-2024 12:00:00 AM

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలతో అక్క డి రాష్ట్రాలు హోరెత్తుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలన్న పట్టుదలతో రిపబ్లికన్లు ఉన్నారు. వచ్చేనెల 5న జరగబోయే ఎన్నికల్లో  ప్రధాన ప్రత్యర్థులయిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉన్నట్లు తాజా సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 21నుంచి మూడు రోజుల పాటు మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు.

తొలి రోజు డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరగబోయే ‘క్వాడ్’ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. క్వాడ్‌లో ఆతిథ్య దేశమైన అమెరికాతో పాటుగా భారత్ ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు సభ్యత్వం ఉంది.ఈ సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటుగా ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతోనూ ముఖాముఖి సమావేశం కానున్నా రు. బైడెన్‌తో జరిగే ముఖాముఖి చర్చల్లో భారత ప్రజల ప్రయోజనాలు, ఇరు దేశాల సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం, స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్ రీజి యన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం, గాజా ప్రాంతంలో ఉద్రిక్తతలను చల్లార్చడంతో పాటుగా ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పులు. సైబర్ సెక్యూరిటీ వంటి వివిధ అంశాలను క్వాడ్ సదస్సులో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ప్రధాని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో‘ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రసంగిస్తారు.

చివరి రోజు ప్రధాని న్యూయార్క్‌లో ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో జరిగే ఈ కార్యక్రమానికి 14 వేల మంది హాజరుకానుండగా, పెద్ద సంఖ్య లో సెలబ్రిటీలు రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ భేటీ అవుతారని తెలుస్తోంది.  మోదీతో తాను తప్పకుండా భేటీ అవుతానని ట్రంప్ కొద్ది రోజుల క్రితం కూడా చెప్పారు. 

దేశానికి తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మోదీ 2014లో న్యూయార్క్‌లో జరిగిన ఓ భారీ కమ్యూనిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రఖ్యాత మాడిసన్ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రవాన భారతీయులు హాజరయ్యారు. అలాగే 2019 సెప్టెంబర్‌లో టెక్సాస్‌లోని ఎన్‌ఆర్‌డీ స్టేడియంలో ‘హౌడీ మోడీ’ పేరిట ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్‌లోనూ పాల్గొన్నారు. దాదాపు 50 వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొన్నారు.

ఆ మరుసటి ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ భారత్‌కు వచ్చినప్పుడు ఆయన గౌరవార్థం అహ్మదాబాద్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరిట భారీ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పుడు మరోసారి అది కూడా ఎన్నికల వేళ ఇరువురు నేతలు భేటీ కానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోదీ పర్యటన అమెరికాలోని ప్రవాస భారతీయ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది.

కాగా మూడో సారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాలో జరుపుతున్న తొలి పర్యటన ఇది. 31 ఏళ్ల క్రితం అమెరికాలో తొలిసారి పర్యటించిన మోదీ ఇప్పటివరకు తొమ్మిదిసార్లు అగ్రరాజ్యాన్ని సందర్శించారు. అమెరికాలో అత్యధిక సార్లు పర్యటించిన భారత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.ఇప్పటివరకు తొమ్మిది మంది భారత ప్రధానులు అమెరికాలో పర్యటించగా మన్మోహన్ సింగ్ మాత్రమే అత్యధికంగా ఎనిమిది సార్లు పర్యటించారు.