calender_icon.png 7 January, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ కీలక పర్యటన

22-08-2024 12:00:00 AM

పోలండ్, ఉక్రెయిన్‌లలో మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం బయల్దేరి వెళ్లారు. పోలండ్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్న మోడీ ఆ దేశ అధ్యక్షుడు ఆం డ్రెజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో చర్చలు జరుపుతారు. అలాగే పో లండ్‌లోని భారతీయులతోనూ ముచ్చటిస్తారు. భారత్, పోలండ్‌లమధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ ఆ దేశంలో పర్యటిస్తుండడం గమనార్హం. అంతేకాదు 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. 1979లో అప్పటి భారత ప్ర ధాని మొరార్జీ దేశాయ్ పోలండ్‌ను సందర్శించారు. కాగా మధ్యయూరప్‌లో భారత్‌కు పోలండ్ బలమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైనప్పుడు అక్కడ చిక్కుకున్న భా రతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించడంలో పోలండ్ కీలక పాత్ర పో షించింది.

అదే విధంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో (194248 మధ్య) 6 వేలమందికి పైగా మహిళలు, చిన్నారులు భారత్‌లో ము ఖ్యంగా జామ్‌నగర్, కొల్హాపూర్ ప్రాంతాల్లో  ఆశ్రయం పొందారు. అప్పటి నవనగర్ మహారాజా జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్‌జీ రంజిత్ సింగ్‌జీ వీరికి ఆశ్రయం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. అప్పడు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయం వేలాదిమంది చిన్నారులు, మహిళలు యుద్ధ భయాలనుంచి క్షేమంగా బైటపడడానికి కారణమయింది. ఆ ఘటనను పోలండ్ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ‘మంచి మహరాజు’గా ఆ యనను గుర్తు చేసుకుంటుంటారు.వార్సాలో ఒక స్కేర్‌కు ఆయన పేరు పెట్టడంతో పాటుగా మరణానంతరం ఆయనకు పోలండ్ అత్యున్నత పురస్కారం ప్రకటించి గౌరవించుకుంది.

ఇప్పటికీ వార్సాలో ఆయన పేరిట ఏర్పాటయిన ఓ పాఠశాల ఈ అరుదైన బంధాన్ని గుర్తు చేసుకుంటూ వే డుకలు జరుపుకొంటోంది. మరోవైపు ఉక్రెయిన్‌లో ప్రధాని జరపబోయే పర్యటనపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రెండేళ్లకు పైగా రష్యాఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్నా దాన్ని ఆపడానికి అగ్రరాజ్యం అమెరికా సహా ఏ దేశమూ ముందుకు రాలేదు. ఒక్క భా రత్ మాత్రమే తటస్థంగా ఉంటూ  శాంతిమంత్రం పఠిస్తోంది. గత నెల 8న భాత్ష్య్రా శిఖరాగ్ర సమావేశం కోసం మాస్కో వెళ్లిన మోదీని పుతి న్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైర ల్ అయ్యాయి. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌పై  మారణకాండకు పాల్పడుతున్న రష్యాతో ప్ర పంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత ప్రధాని అంత సన్నిహితంగా ఉండడమేంటని ప్రశ్నించారు. మోదీ, పుతిన్‌ల సమావేశం రోజునే కీవ్‌లోని చిన్నపిల్లల ఆస్పత్రిపై రష్యా దాడి జరగడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రష్యాలో పర్యటించిన నెలరోజుల్లోనే మోదీ ఉక్రెయిన్‌కు వెళ్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రష్యాఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మోదీ, జెలెన్‌స్కీలు రెండుసార్లు కలుసుకున్నారు. మూడో సారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇటలీలో జరిగిన జి7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్లినప్పుడు సైతం జెలెన్‌స్కీతో మోడీ సమావేశమయ్యారు.

జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ వెళ్తున్న మోదీ పోలండ్‌నుంచి ప్రత్యేక రైల్లో దాదాపు పదిగంటలపాటు ప్రయాణించి కీవ్ చేరుకుంటారు. మళ్లీ అదే రైల్లో పోలండ్‌కు తిరిగి వచ్చి స్వదేశానికి పయనమవుతారు. ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. రెండు దేశాల పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని మోదీ పోలండ్‌తో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధానాంశంగా తన పర్యటన సాగనుందని పేర్కొన్నారు. అలాగే గత రెండేళ్లుగా కొనసాగతున్న ఉక్రెయిన్ వివాదానికి  శాంతియుత పరిష్కారానికి జెలెన్‌స్కీతో తన ఆలోచనలను పంచుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని కూడా ప్రధాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరి మోదీ శాంతి యత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో చూడాలి.