calender_icon.png 18 October, 2024 | 3:33 AM

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోదీ సర్కార్

18-10-2024 12:49:45 AM

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్‌రెడ్డి 

ముషీరాబాద్, అక్టోబర్ 17: దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. ఉపా చట్టంతో దుర్మార్గమైన హింసాకాండను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామిక వాదులంతా ఏకతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో ఉపా చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు గురువారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ జీ హరగోపాల్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈటీ నర్సింహ, వీఎస్ బోస్, బొమ్మగాని ప్రభాకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా చాడా మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను ఉపా చట్టంతో మోదీ ప్రభుత్వం అణచివేసిందని అన్నారు. అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఉపా వంటి చీకటి చట్టాలకు చోటు లేదన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి కారణం ఎవరని ప్రశ్నించారు.

సీపీఐ నాయకులు ఎస్ ఛాయాదేవి, కే యాదగిరి, బీ స్టాలిన్, ఆదిరెడ్డి, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అనిల్ కుమార్, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నాయకుడు బల్ల రవి, మానవ హక్కుల సంఘం నాయకులు అన్వర్ ఖాన్, శ్రీకాంత్, శ్రీనివాస్, నళిని, ఒమర్ ఖాన్ పాల్గొన్నారు.