ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి మంగళవారానికి 100 రోజులు పూర్తయింది. ఈ ఏడాది జూన్ 9న మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. మంగళవారం ప్రధాని మోదీ 74వ పుట్టిన రోజు కూడా కావడంతో గత 100 రోజుల్లో కొత్త ప్రభుత్వం సాధించిన విజయాలపై పలువురు మంత్రులు ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా విడుదల చేశారు. అయితే గతంలో రెండుసార్లు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి పని తీరులో స్పష్టమైన తేడా కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గతంలో రెండు సార్లు బీజేపీకి సొంతంగా మెజారిటీ లభించగా, ఈ సారి మాత్రం అలా జరగలేదు.
ఫలితంగా ప్రభుత్వం మనుగడకు జేడీ(యూ), తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వంద రోజుల పాలనలో చాలా సందర్భాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించిందనేది విశ్లేషకుల భావన.2014లో తొలిసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద నోట్ల రద్దుతో పాటుగా జన్‌ధన్ యోజన, డిజిటల్ ఇండియా, 100 స్మార్ట్ సిటీల ప్రారంభం లాంటి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలను మోడీ 2.0 పాలనలో తీసుకోవడం జరిగింది.
ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకు వచ్చింది. ఈ ఏడాది జులై 1నుంచి ఈ కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. అలాగే నీట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో పరీక్ష మోసాలను కట్టడి చేసేందుకు కఠినమైన శిక్షలకు వీలు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది.ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకు పైబడిన సీనియర్ సిటిజనలదరికీ ఆరోగ్య రక్షణను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వందే భారత్ రైళ్ల విస్తరణను పెద్ద ఎత్తున చేపట్టారు. హైవేల విస్తరణతో పాటుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వంటి వాటికి కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. జూన్‌లో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటినుంచి దాదాపు రూ.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించినట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రస్తుత మోదీ ప్రభుత్వం అనేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవలసి వచ్చింది.
దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ప్రయోజనాలను తొలగించాలనే బడ్జెట్ ప్రతిపాదనలపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తం కావడంతో ఆ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలాగే వక్ఫ్ సవరణ బిల్లు విషయంలోనూ సర్కార్ యూటర్న్ తీసుకుంది.ఈ బిల్లు రాష్ట్రాల అధికారాలకు భంగం కలిగించడమే కాకుండా ఆస్తిహక్కులు, మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని ప్రతిపక్షాలతో పాటుగా మిత్రపక్షాలనుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించడానికి అంగీకరించాల్సి వచ్చింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టుల భర్తీ విషయంలోనూ వెనక్కి తగ్గింది. మరోవైపు ‘అగ్నివీర్’ పథకం విషయంలో కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోదీ గత రెండు ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం అనేక విషయాల్లో పట్టు విడుపులతో వ్యవహరించాల్సి వస్తోందన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్రలాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గనుక బీజేపీకి అనుకూలంగా రాని పక్షంలో మరింతగా రాజీ పడక తప్పదేమో.