15-02-2025 01:19:05 AM
నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా ఫర్వాలేదు.. బీసీ రిజర్వేషన్ మాట నిలబెట్టుకుంటా
* ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2002లో వాళ్ల కులాన్ని బీసీల్లో కలుపుకున్నారు. మోదీ కుల ధ్రువీకరణ పత్రంలో మాత్రమే బీసీ అని ఉంటుంది. కానీ ఆయన మనసులో బీసీ ఉండదు. ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ అగ్రకులమే.
* కేసీఆర్‌కు బలిసి కులగణనలో పాల్గొనలేదు. సంచి బియ్యం వండితే వాళ్ల జాతి మొత్తానికి బియ్యం సరిపోతాయి. సంచి బియ్యం లెక్కలు బయటపడతాయనే సర్వేలో పాల్గొనలేదు.
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): కులగణన సర్వే జరగకూడదని మోదీ, కేడీ కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కులగణన జరిగితే చట్టప్రకారం బీసీలు రిజర్వేషన్లు సాధించుకోవచ్చని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ, కులగణన పవర్ పాయింట్ ప్రజెం టేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు..
ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని.. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2002లో వాళ్ల కులాన్ని బీసీల్లో కలుపుకున్నారని ఆరోపించారు. మోదీ కుల ధ్రువీకరణ పత్రంలో మాత్ర మే బీసీ అని ఉంటుందని.. కానీ ఆయన మనసులో బీసీ ఉండదని, ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ అగ్రకులమేనని పేర్కొన్నారు. అన్నీ తెలుసుకునే మోదీ కులం గురించి మాట్లాడుతున్నానని, ఆయన బీసీ కాదు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
జనగణనలో బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు, ఎస్సీలు ఎవరి మాయలో పడొద్దని.. కులగణన, ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రెండో విడత కులగణనను సద్వినియోగం చేసుకోవాలని కోరా రు.
కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఇంటి ముందు మేల్కొ లుపు డప్పు కొట్టాలని పిలుపునిచ్చారు. వాళ్లు సర్వేలో పాల్గొనపోతే సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. వాళ్లు సర్వేలో పాల్గొనపోతే సర్వేనే తప్పు అంటారని తెలిపారు.
అయినా ఫర్వాలేదు..
తాను ఆఖరి ‘రెడ్డి’ ముఖ్యమంత్రిని అయినా ఫర్వాలేదని, కానీ తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతను తీసుకున్నానని చెప్పారు. దొంగ లెక్కలు చూపించాలని అనుకుంటే తమ కులపోళ్లను 5 శాతం ఎందుకు చూపిస్తానని.. ఎక్కువ చేసి చూపిస్తాను కదా అన్నారు.
కులగణన సందర్భంగా కులాల లెక్కలను పక్కాగా తేల్చామని, తమ నాయకుడి ఆదర్శాన్ని నిలబెట్టేందుకు తాను కార్యకర్తగా మిగిలేందుకు కూడా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. తన కోసమో, తన పదవి కోసమో కులగణన చేయలేదన్నారు. కులాల లెక్కలను పక్కాగా తేల్చామని, ఇది తమ నిబద్ధతగా పేర్కొన్నారు.
కొందరు ఆరోపిస్తున్న ట్లు కులగణనలో ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. కులగణన సర్వేను తప్పుబడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే అధికారికంగా ఎందుకు వెబ్‌సైట్‌లో పెట్టలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబానికి నివసించే హక్కు లేదు..
కులగణన సర్వేలో పేర్లు నమోదు చేయనప్పుడు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణలో నివసించే హక్కు లేదని రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనజీవన స్రవంతిలో కేసీఆర్ కుటుంబం లేదని.. కేసీఆర్ కుటుంబం, మోసగాళ్ల లెక్కలు బయటపడుతాయనే కులగణనలో పాల్గొనలేదని ఆరోపించారు.
గ్యాంబ్లర్స్ అంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారన్నారు. కొంతమంది తెలియకుండా కేసీఆర్ కుట్రలకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బలిసి కులగణనలో పాల్గొనలేదన్నారు. సంచి బియ్యం వండితే వాళ్ల జాతి మొత్తానికి బియ్యం సరిపోతాయని.. సంచి బియ్యం లెక్కలు బయటపడతాయనే సర్వేలో పాల్గొనలేదంటూ ఎద్దేవా చేశారు.
అధికారిక లెక్కలు ఉంటే..
దేశవ్యాప్తంగా కులగణన జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ పార్లమెంట్ నిలదీశారని రేవంత్‌రెడ్డి చెప్పారు. అధికారిక లెక్కలు ఉంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పవచ్చని అన్నారు. దేశంలో అత్యంత ముఖ్యమైన రెండు సమస్యలకు తెలంగాణ రాష్ర్టంలో పరిష్కారం దొరికిందన్నారు.
ప్రభుత్వం మీద ఆరోపణలు, అపోహలు సృష్టించాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రాహుల్‌గాంధీ సామాన్య ప్రజల కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని.. పక్క రాష్ర్టంలో పార్టీకి సీట్లు రావని తెలిసినా.. దేశంలో అధికారం కోల్పోయినా.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ మాత్రమేనన్నారు. మైనార్టీలు రిజర్వేషన్లు పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు.
ఏ కులానికో.. మతానికో వ్యతిరేకం కాదు: మంత్రి దామోదర
ఎస్సీ వర్గీకరణ ఏ ఒక్క కులానికి, మతానికి వ్యతిరేకం కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. రిజర్వేషన్ల కేటాయింపు 2011 జనాభా లెక్కల ప్రకారం చేశారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవన్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలడించిన గంట వ్యవధిలో శాసనసభలో ప్రకటన చేసిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలులో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులకు, జిల్లాల అధ్యక్షులకు, కార్యకర్తలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు.
వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికలో 0.01 శాతం కూడా మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యథావిధిగా వర్గీకరణను అమలు చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు పేర్కొన్న ఎంపిరికల్ డేటా సహా ఇతర అన్ని ప్రమాణాలనూ పరిగణనలోకి తీసుకొని, ప్రతీ వర్గానికి న్యాయం చేసేలా కమిషన్ నివేదిక ఇచ్చిందని, క్రీమిలేయర్ మినహా కమిషన్ నివేదికను యథావిధిగా కేబినెట్ ఆమోదించిందన్నారు. త్వరలోనే వర్గీకరణ అమల్లోకి వస్తుందని.. ఆ తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు.
97 శాతం కులగణన పూర్తి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్లు కొంతమంది సర్వేలో పాల్గొనకపోయినా రాష్ట్రం లో 97 శాతం కులగణన సర్వే పూర్తయిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇంకా 3 శాతం మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. కొన్ని ఇళ్లకు తాళాలు పెట్టి ఉన్నాయన్నారు.
కేసీఆర్, కేటీఆర్ జనజీవన స్రవంతిలో కలవాలని.. కులగణన సర్వేలో పాల్గొనాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సామాన్య జనాలకు మేలు చేయడం నచ్చని వారే ప్రభుత్వం మీద చేసే ఆరోపణలు చేస్తున్నారన్నారు. సర్వేలో చిన్న పొరపాటు కూడా జరగలేదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కో చైర్మన్ మంత్రి దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
కులగణన, వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు
కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో కులగణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో తొలిసారిగా కులగణన సర్వేను సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం చిత్తశుద్ధితో పాలన సాగిస్తోందని చెప్పారు. రాహుల్‌గాంధీ ఆలోచన, ఆశయం మేరకు కులగణన సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. 40 ఏళ్ల కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. పీసీసీ కార్యవర్గంతో పాటు ఇతర పదవుల భర్తీ కోసం కసరత్తు జరుగుతుందని చెప్పారు.
కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని.. సర్వేపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు తండ్రి మీద కొడుకులాగా అలకబూనిన మాట వాస్తవమని.. వారందరికీ న్యాయం చేస్తామన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్