కచ్ సరిహద్దు నుంచి పాక్‌కు వార్నింగ్
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ప్రధాని శుభాకాంక్షలు
కచ్(గుజరాత్), నవంబర్ 1: ప్రతీ ఏడాది లాగే దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా కొనసాగించారు. గుజరాత్ కచ్ జిల్లాలోని ఇండో సరిహద్దులో త్రివిధ దళాల సిబ్బందితో ఆయన గురు వారం దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించిన మోదీ ముందుగా కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీనాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వారికి స్వీట్లు తినిపించి సరదాగా ముచ్చటించారు. గుజరాత్ పర్యటన అనంతరం మోదీ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఒక్క అంగుళం కూడా వదులుకోం..
కచ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘కచ్‌వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు’ అంటూ మోదీ అన్నారు. సర్‌క్రీక్‌పై దాడికి గతంలో శత్రుదేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడి సైనికులు ఆ కుట్రలను తిప్పొకొట్టారు. ‘దేశ సరిహద్దులోని ఒక్క అంగుళం విషయంలో కూడా రాజీపడని ప్రభుత్వం ఇప్పుడు ఉంది’ అని మోదీ స్పష్టం చేశారు.