calender_icon.png 15 November, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో మోదీ, గాంధీ రెండే వర్గాలు

12-11-2024 12:37:56 AM

  1. మైనార్టీ సంక్షేమం కోసం కాంగ్రెస్ అహర్నిశలు కృషి
  2. హిందూ ముస్లిం భాయీభాయి అన్నదే మా విధానం
  3. జాతీయ విద్యా దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): దేశంలో రెండే వర్గాలున్నాయని.. ఒకటి మోదీ వర్గం, మరొకటి గాంధీ వర్గం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జాతీ య విద్యాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.

మెజార్టీ, మైనార్టీ ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారని పేర్కొన్నారు. స్వా తంత్య్రం రాగానే మౌలానా అబుల్ కలామ్‌ను నెహ్రూ విద్యాశాఖ మంత్రిని చేశారని గుర్తుచేశారు. విద్యావ్యవస్థలో మౌలానా అబుల్ కలామ్ అనేక విధానాలు తీసుకొచ్చారని కొనియాడారు. చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, అదే చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశారని తెలిపారు.

౪ ఎమ్మెల్సీల్లో ఒకటి మైనార్టీలకు ఇచ్చామని, ఈ ప్రభుత్వంలో అనేక పదవులు అప్పగించామని వెల్లడించారు. మైనా ర్టీలకు తమ పార్టీ ౪ శాతం రిజర్వేషన్లు కల్పించిందని స్పష్టంచేశారు. వాళ్ల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఓడించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో మైనార్టీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మైనార్టీలు అందరూ అండగా ఉంటే విద్యా, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించు కుందామని విజ్ఞప్తి చేశారు. 

మంత్రి పదవి అవకాశం లేక పోయింది 

ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ వర్గం పనిచేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దేశ సమైక్యతకు గాంధీ వర్గం కృషి చేస్తోందని స్పష్టంచేశారు. తాము ముస్లింలను ఓటర్లుగా చూడలేదని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనార్టీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, అందుకే మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. కానీ, షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారులుగా, అమీర్ అలీ ఖాన్‌ను ఎమ్మెల్సీని చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు.

కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, మైనార్టీ గురుకులాల సొసైటీ అధ్యక్షుడు ఫహీముద్దీన్ ఖురేషీ, తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహెర్ బిన్ అహ్మద్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం తదితరలు పాల్గొన్నారు.