calender_icon.png 11 January, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు!

17-09-2024 03:24:39 AM

  1. పదకొండేండ్లుగా నియామకాలు చేపట్టని ప్రభుత్వాలు
  2. టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల్లో 70 శాతంపైగా ఖాళీలు
  3. కొన్ని డిపార్ట్‌మెంట్లకు ప్రొఫెసర్లే లేని వైనం

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): పది, పదిహేను రోజుల్లో విశ్వవిద్యా లయాల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామని ఆగస్టు 26న రాష్ట్ర సచివాలయంలో సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సీఎం ప్రకటించి కూడా 20రోజుల పైనే గడిచింది. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీని గాలికొదిలింది.

11 ఏండ్లలో ఎలాంటి నియా మకాలు చేపట్టకపోవడంతో ఆయా యూనిర్సిటీల్లో 70 శాతానికిపైగా ఖాళీలున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీతోపాటు మిగతా కొన్ని వర్సిటీల్లోనైతే పలు విభాగాలకు హెచ్‌ఓడీలే లేరంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీలోనైనా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ప్రొఫెసర్లను నియమించుకుంటున్నారు. దీంతో బోధనా ప్రమా ణాలు పడిపోతున్నాయి.

ప్రత్యేక బోర్డుతో కాలయాపన...

యూనివర్సిటీల్లోని ఖాళీలను యూనివర్సిటీలే భర్తీ చేసుకునేవి. కానీ వర్సిటీల్లోని ఖాళీలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి.. భర్తీ చేసేందుకు యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపారు. అది అక్కడితో అటకెక్కింది. కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఖాళీల భర్తీని మళ్లీ యూనివర్సిటీలకే అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు చేస్తోంది. ఈ ప్రభుత్వమైనా వర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని విద్యార్థులు, ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

చివరిసారిగా 2013లో..

2013లోనే చివరిసారిగా యూనివర్సిటీల్లో నియామక ప్రక్రియను చేపట్టారు. ఆ తర్వాత ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీల పాత్ర ఎనలేనిది. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత  బీఆర్‌ఎస్ ప్రభు త్వం వాటిని పూర్తిగా విస్మరించడం గమనార్హం. ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో చదువులు, పరిశోధనలపై ప్రభావం పడుతోంది. పరిశోధనల్లో యూనివర్సిటీలు వెనుకబడుతున్నాయి. ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ప్రకటించిన ర్యాంకుల్లోనూ మన రాష్ట్ర యూనివర్సిటీలు ఒక్కటి కూడా మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకోలేదు. ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలతో నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గ్రేడ్‌లోనూ వెనుకబడుతున్నాయి. నిధుల కేటాయింపుల్లోనూ యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అన్ని యూనివర్సిటీలకు కలిపి ఏటా రూ.500 కోట్ల లోపు మాత్ర మే నిధులను కేటాయిస్తున్నారు. ఏ ఒక్క ఏడాది రూ.వెయ్యి కోట్లు దాటలేదు.

ఉన్నది 30 శాతమే..

రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల పరిధిలో ప్రతి నెలా ప్రొఫెసర్లతో పాటు నాన్ టీచింగ్ ఉద్యోగులూ రిటైర్డ్ అవుతున్నారు. వారి స్థానంలో కొత్త వారి ని నియమించడం లేదు. దీంతో కొన్ని విభాగాలకు ఒకరిద్దరు మాత్రమే ప్రొఫెసర్లు ఉంటున్నారు. ఈ యూనివర్సిటీ లకు ప్రభుత్వం మొత్తం 2,826 పోస్టుల ను మంజూరు చేసింది. ప్రస్తుతం 850 మంది ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నా రు. గత ప్రభుత్వం 2017లో 1,061 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి జీవో నెంబర్ 34ను జారీ చేసి చేతులు దులుపేసుకుందనే విమర్శలు ఉన్నాయి.