సదాశయంతో టెలిఫోన్‌ను కనుగొని, తర్వాత వైర్‌లెస్ సాంకేతికత
ఆధారంగా మొబైల్‌ను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.
మన కోసం మొబైలా, మొబైల్ కోసం మనమా? అంటే మొబైలే
లోకంగా కాలం గడుపుతున్న వారెందరో.
స్మార్ట్ ఫోన్స్ మాయలో పడి కాలంతోపాటు మెదడునూ పాడుచేసుకుం టున్న వారెందరో. పబ్లిక్ ప్రదేశాలలో సెల్ ఫోన్ చూస్తూ పలు ప్రమాదాలకు గురవుతున్న వారూ ఉంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్స్ యుగం వచ్చిన తర్వాత ప్రజలలో వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒక సర్వే ప్రకారం, ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లకు చేరుకుంటుండగా, వీరిలో సగానికి ఎక్కువమంది మొబైల్స్ వాడుతున్నట్టు సమాచారం. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అనేది ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉన్నత స్థాయి వ్యక్తులనుంచి స్కూల్ పిల్లలు, కాలేజీ యువత, వృద్ధుల వరకూ అందరికీ సెల్ తప్పనిసరైంది. సమాచార చేరవేతకు మాత్రమే ఇది పరిమితం కాకుండా, సినిమా లు, వీడియోలు, ఇంకా అనేక అవాంఛనీయ అంశాలతో అందాల ప్రపంచంతో కనువిందు చేసే స్థాయి కి చేరుకున్నాక, యువతనుంచి వృద్ధుల వరకు దాని మాయలో పడకుండా వుంటారా?
మార్ఫింగ్‌లతో వికృతానందం
ప్రస్తుత సమాజాన్ని మొబైల్స్ దారుణంగా వాడుకుంటున్నాయి. గంటలకొద్దీ అనవసరమైన, పనికి మాలిన విషయాలతో చాలామంది వాటితోనే కాలయాపన చేస్తున్నారు. మొబైల్స్‌కి అనుసంధానంగా, సోషల్ మీడియాలో భాగమైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన వాటిలో కొందరు విద్వేష పూరితమైన, అసందర్భ విషయాలను అనేక రకాలుగా పోస్టులుగా పెడుతున్నారు. పొద్దున లేవగానే గుడ్‌మార్నింగ్, రాత్రవగానే గుడ్‌నైట్‌లు. పండగలు వచ్చాయంటే, గ్రూపులు, వ్యక్తిగత నంబర్లకు కుప్ప లు తెప్పలుగా మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు. పలువురి ఫొటోల మార్ఫింగ్‌లతో కొందరైతే వికృతానందాన్ని పొందుతున్నారు. మరికొందరు ఎదుటివాళ్ల మనోభావాలను, విశ్వాసాలను, విలువలను అస్సలు పట్టించుకోకుండా స్టేటస్‌లలో చెత్తంతా అప్‌లోడ్ చేస్తూ వుంటారు.
ప్రభుత్వమైనా పట్టించుకోవాలి
ఎన్నో మంచి విషయాలకు ఉయోగించుకోవాల్సిన మొబైల్స్ సాంకేతికతను ఎందుకూ పనికిరాని విషయాలకు వాడుతూ, ఒక ఉన్మాద పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్న వారిపట్ల ప్రభుత్వం అప్రమ త్తం కావాలి. చట్టవ్యతిరేక పోస్టులపైన తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి. శాసనసభలు, పార్లమెంటు ఈ విషయమై మరింత కఠిన చట్టాలు తేవాలి. కనీసం పక్కన ఉన్నవారిని ఆపాయ్యంగా పలకరించే మానవీయ విలువలను సైతం ఈ మొబైల్స్ పక్కదారి పట్టిస్తున్నాయి. నేటి సమాజంలో చాలామంది వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మొబైల్స్‌ద్వారా వివిధ సోషల్ మీడియా గ్రూపులలో బహిరంగంగా ప్రచారం చేసుకుంటూ అల్లరి పాలవుతున్నారు. ఇంకొందరైతే, కుటుంబ గొడవలతో మానసిక ఆవేదనకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలూ చూస్తున్నాం.
సతీష్ రెడ్డి సెల్: 9848445134