calender_icon.png 2 January, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎంటీఎస్ నూతన సర్వీసులు

31-12-2024 02:06:45 AM

* మేడ్చల్ నుంచి తెల్లాపూర్, ఉందానగర్‌కు రైళ్లు 

* కొత్త టైం టేబుల్‌ను విడుదల చేసిన అధికారులు

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): నగరంలోని ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం) రైళ్ల రాకపోకలపై అధికారులు ఎట్టకేలకు దృష్టి సారించారు. వినియోగదారుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులకు స్పందించిన రైల్వే శాఖ వాటి సమయాన్ని మార్చడంతో పాటు నూతన రైళ్లను ప్రవేశపెట్టేందుకు అంగీకరించింది.

ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్, హైదరాబాద్ డీఆర్‌ఎంలు భారతేష్ కుమార్ జైన్, లోకేశ్ విష్ణోయ్ సోమవారం ప్రయాణికుల సంఘాలతో చర్చించారు. జనవరి 1 నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకల వేళలను పూర్తిగా మార్చి ప్రయాణికులకు అనుకూలంగా చేస్తామని చెప్పారు.

మేడ్చల్ నుంచి ఫలక్‌నుమా, తెల్లాపూర్, హైదరాబాద్, లింగంపల్లికి.. ఘట్కేసర్ నుంచి లింగంపల్లికి కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించామన్నారు. ప్రస్తుతం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే రైళ్లను ఫలక్‌నుమా, లింగంపల్లికి నడుపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్ల కొత్త టైంటేబుల్‌ను అధికారులు విడుదల చేశారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు చేరుకునేందుకు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

త్వరలో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం

ఈ నెల 28న చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ ప్రారంభం కావాల్సి ఉండగా... మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణంతో వాయిదా పడింది. రాష్ట్రంలో జనవరి 3వ తేదీ వరకు సంతాప దినాలు ఉన్నందున అప్పటివరకు ప్రారంభించమని.. త్వరలోనే మరో తేదీని వెల్లడిస్తామని చెప్పారు.