calender_icon.png 29 October, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రికి ఎంఎంటీఎస్

29-10-2024 12:49:27 AM

  1. భక్తులకు మెరుగవ్వనున్న ప్రయాణసౌకర్యం
  2. చర్లపల్లి టెర్మినల్ ప్రయాణికులకూ ఉపయోగం
  3. త్వరగా చేపట్టాలని కోరుతున్న నగర వాసులు

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ప్రఖ్యాత యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధికి నిత్యం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎప్పటి నుంచో ఊరిస్తూ వచ్చిన ఎం ఎంటీఎస్ రైలు సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రూ.640 కోట్ల తో టెండర్లకు రైల్వే బోర్డు అనుమతి లభించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.

ఈ నేపథ్యంలో భక్తులు, ఈ మార్గంలో ప్రయాణించే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్డు ఆవల వరకు విస్తరిస్తున్న నేపథ్యంలో నగరవాసుల ప్రయాణానికి కూడా ఈ నూతన రైల్వే సదుపాయం ఉపయుక్తంగా మారనుంది.

2016లోనే ఎంఎం టీఎస్ రెండో దశ కింద యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నా... ఘట్కేసర్ వరకు మాత్రమే విస్తరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం కారణంగా ఇన్నాళ్లు ఆగుతూ వచ్చిన యాదాద్రి ఎంఎంటీఎస్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది.

నిత్యం వేలాది మంది భక్తుల రాక 

యాదాద్రికి రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు వస్తారు. నిత్యం వేలాది మంది యాదాద్రికి వచ్చే భక్తులు చాలావరకు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. యాదా ద్రికి 3 కి.మీ దూరంలో యాదాద్రి (రాయిగిరి) రైల్వే స్టేషన్ ఉంది. ప్రస్తుతం ఈ స్టేషన్ లో 2 ఎక్స్‌ప్రెస్, 2 లోకల్ రైళ్లు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.

స్టేషన్‌కు చేరుకున్నా అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు ఇబ్బంది అవుతోంది. పైపెచ్చు ఈ 4 రైళ్లు వరంగల్ వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతాయి. యాదాద్రికి వచ్చే భక్తులకు ఇందులో అవకాశం లేకుండా పోయింది. దాంతో భక్తులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతు న్నారు.

సెలవు రోజుల్లో భక్తుల తాకిడీ పెరిగి బస్సుల్లోనూ నిల్చునే పరిస్థితి కూడా ఉండట్లేదు. దీంతో ఎంఎంటీఎస్ అందుబాటు లోకి వస్తే చాలా మేలవుతుందని ఎప్పటి నుంచో భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి కేవలం 45 నిమిషాల్లో రూ. 20 లోపు ఛార్జితో భక్తులు యాదాద్రి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

చర్లపల్లి టెర్మినల్‌కు వచ్చే ప్రయాణికులకు కూడా వెసులుబాటు

యాదాద్రికి ఎంఎంటీఎస్ సౌక ర్యం అందుబాటులోకి వస్తే త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి టెర్మినల్‌కు అదనపు సౌకర్యంగా మారనుంది. చర్లపల్లి నుంచి 25 లాంగ్ రూట్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, చెన్నై సహా వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సికింద్రాబాద్‌కు బదులుగా చర్లపల్లి నుంచే ప్రారంభమవుతాయి.

ఈ నేపథ్యంలోనే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లి స్టేషన్‌కు చేరుకునేందుకు యాదాద్రికి నడిపించబోయే ఎంఎంటీఎస్ రైళ్లు సౌకర్యంగా మారనున్నాయి. దీంతో పాటు ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి వెళ్లే ప్రయాణికులకు సైతం ఎంతో సౌకర్యంగా మారనుంది. బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్లేందుకు సైతం అవకాశం ఏర్పడుతుంది.

యాదాద్రి టౌన్‌షిప్ వరకు రైళ్లు నడపాలి

యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వనందున రైల్వే శాఖ మందుకు రాలేదు. ఇప్పుడు రాష్ట్రానితో సంబంధం లేకుండా కేంద్రమే పనులు చేయడం సంతోషం. అయి తే ఎంఎంటీఎస్ రైళ్లను ఇప్పుడున్న యాదాద్రి (రాయిగిరి) స్టేషన్ వరకు మాత్రమే నడిపితే భక్తులకు ఇబ్బంది అవుతుంది.

అక్కడి నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న టెంపుల్‌కు చేరుకునేందుకు భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే యాదగిరిగుట్ట బస్టాండ్ వరకు రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ వేయాలి. అప్పుడే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

 నూర్ అహ్మద్ అలీ, 

హైదరాబాద్ ప్రయాణికుల సంఘం ప్రధాన కార్యదర్శి