calender_icon.png 8 April, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా ఎమ్మెల్సీల ప్రమాణం

08-04-2025 01:01:23 AM

  1.  ఏడుగురితో ప్రమాణం చేయించిన మండలి చైర్మన్
  2. ఎమ్మెల్యే కోటాలో విజయశాంతి తోపాటు మరో ముగ్గురు
  3. ఇద్దరు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ సభ్యులు కూడా
  4. హాజరైన ఆయా పార్టీల ముఖ్యనేతలు

హైదారాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): తెలంగాణ శాసనమండలి వేదికగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో  ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురితో పాటు ఇటీవల జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఉన్నారు.

విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ (కాంగ్రెస్), మల్క కొమురయ్య, అంజిరెడ్డి (బీజేపీ), నెల్లికంటి సత్యం (సీఐపీ), శ్రీపాల్‌రెడ్డి (పీఆర్‌టీయూ)లతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.

సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్‌రావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీమంత్రి జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజు శ్రవణ్‌కుమార్ మరోరోజు ప్రమాణం చేయనున్నారు.

టీచర్ల సమస్యల పరిష్కారమే ఎజెండా: మల్క కొమురయ్య

టీచర్ల, విద్యారంగ సమస్యల కోసం పోరాటం చేస్తానని.. టీచర్ల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు. మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ర్టంలో విద్యారంగ సమస్యలపై, టీచర్లకు రావాల్సిన పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బిల్లుల కోసం పోరాటం చేస్తానని చెప్పారు.

మేధావులంతా ఆలోచించి.. రాష్ర్టంలో బీజేపీ ఉంటేనే పాలన బాగుంటుందని నమ్మి ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు సహా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని జోష్యం చెప్పారు.న్నారు. 

ఉపాధ్యాయ గొంతు వినిపిస్తా: శ్రీపాల్ రెడ్డి

ఉపాధ్యాయుల గొంతును శాసనమండలిలో వినిపిస్తానని నూతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. శాసనమండలిలో ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ..విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యలతోపాటు పెండింగ్‌లో ఉన్న డీఏల మంజూరు, పీఆర్సీ అమలుకు కృషిచేస్తానని ఆయన తెలిపారు.