25-02-2025 10:56:18 PM
మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ క్రాంతికర్ పోకల కిరమణ్ మాదిగ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనకబడిన (బేడ బుడగ) జంగం కులానికి, మాదిగ కులానికి సంబంధించిన ఉద్యమాకారులకు ఎమ్మెల్సీ స్థానాలను కల్పించాలని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ క్రాంతికర్ పోకల కిరమణ్ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోటా ద్వారా 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ చేయనున్నందున బేడ బుడగ జంగం కులానికి ఒకటి, మాదిగ కులానికి సంబంధించిన ఉద్యమకారులకు ఒక ఎమ్మెల్సీ స్థానాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం బర్కత్‌పురలోని మహాకూటమి సామాజిక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వారికి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడం వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను అధికార పార్టీ గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు.
స్వాతంత్య్రం సిద్దించినప్పటి నుండి బేడ బుడగ జంగం కులానికి చట్ట సభల్లో ప్రాతినిధ్య లేదని ఆయన ఆవేద వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గాల్లో మాల, మాదిగల తరువాత అత్యధిక జనాభా కలిగిన కుల అయినప్పటికి, ఇప్పటికి రాజకీయంగా ఎలాంటి అవకాశాలు రాలేదని అన్నారు. సామాజిక, ఆర్థికంగా వెనకబడిన ఈ వర్గానికి రాజకీయ ప్రాతినిధ్య కల్పించడం ద్వారా సమాజంలో సమతుల్యత తీసుకురాగలమని, మాదిగ కులానికి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోచీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ ప్రేమ్‌రాజ్, మహాకూటమి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కొండ రాజు మాదిగ, సికింద్రాబాద్ అధ్యక్షుడు జనార్థన్, హైదరాబాద్ అధ్యక్షుడు మహేష్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.