హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్ల గ్రామస్థులు ఎన్నో ఏళ్లుగా భూములను ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి భూములను గుంజకుని ఫార్మాసిటీ కంపెనీకి అప్పగించే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. గత తొమ్మిది నెలలుగా తమ భూములను ఫార్మాసిటీ కోసం ఇవ్వమని లగచర్ల రైతులను నిరసనలు తెలుపుతున్నారు. రైతులు తమ భూముల ఇవ్వమన్నందుకు లగచర్ల గ్రామంలో కరెంటు కట్ చేసి, ఇంటర్ నెట్ సేవలను బంద్ చేసి అర్థరాత్రి గ్రామస్థులను అక్రమంగా అరెస్ చేసి జైల్లో పెట్టారని మండి పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, మళ్లీ ఎదురు తిరుగుతే తమపై దాడి చేయిస్తారోనని లగచర్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని సత్యవతి రాథోడ్ వివరించారు. లగచర్ల ఫార్మా బాధితులకు, గిరిజన బిడ్డలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళ కమిషన్ తో పాటు రాష్ట్రపతిని కూడా కలిసి గిరిజనుల కోసం పోరాడతామని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. సోమవారం లగచర్ల ఫార్మా బాధితులతో పాటు బీఆర్ఎస్ నేతలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళ కమిషన్ చైర్ పర్సన్ లను కలిసి ఫిర్యాదు చేశారు.