19-04-2025 01:21:10 AM
మజ్లిస్‌కు జీహుజూర్
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ప్రజలను దోపిడీ చేసిన, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన, ప్రజల రక్తం తాగిన మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు జీహుజూర్ అంటున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రజాకార్లు, జాతీయతా భావజాలానికి మధ్యన జరుగుతున్న ఎన్నికల్లో ఎవరి పక్షం వహిస్తారో తేల్చుకోవాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పోరేటర్లకు సూచించారు.
బేగంపేట హరితప్లాజాలో శుక్రవారం జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎందుకు పోటీచేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాం కొడుతున్న రాహుల్‌గాంధీ, కేసీఆర్‌కు బీజేపీని విమర్శించే నైతికహక్కు లేదన్నారు.
మజ్లిస్‌పార్టీ, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, ఉద్యమకారుల వారసత్వాన్ని బీజేపీ కొనసాగిస్తోంద న్నారు. మజ్లిస్ పాతపట్నానికే పరిమితం కాలేదని.. తెలంగాణలో అన్ని అసెంబ్లీ నియోజకవ ర్గాల్లో చాపకిందనీరులా విస్తరిస్తోందన్నారు. బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మజ్లిస్‌కి విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.
తెలంగాణలో మళ్లీ రజాకార్ల పాలన..
తెలంగాణ ప్రజలు చైతన్యంగా ఆలోచించకపోతే మళ్లీ రజాకార్ల పాలనలాంటి పరిస్థితులు దాపురించే ప్రమాదం ఉందని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. మజ్లిస్ నాయకులు పాతపట్నంలో హిందువుల ఇళ్లను స్వాధీనం చేసుకుని ప్రజలను ఖాళీ చేయించిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. హిందూ బస్తీలను ఖాళీ చేయిస్తున్న తీరుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
తెలంగాణను, హైదరాబాద్‌ను బలిచేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వెనుకాడడం లేదన్నారు. ప్రజలను జాగృతం చేసేందుకే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిరక్షణతో పాటు తమకు గెలుపూ ముఖ్యమేనన్నారు.
మజ్లిస్ పార్టీ మతోన్మాదం, గూండాయిజాన్ని ఎదుర్కొంటూ బీజేపీ ధర్మయుద్ధం చేస్తోందన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి నగరాన్ని రక్షించాలంటే, ప్రజలు తమ కార్పోరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చి ఓటు వేసేలా చూడాలన్నారు.
రియల్ ఎస్టేట్ బాగున్న చోటే అభివృద్ధి..
బీఆర్‌ఎస్ హయాంలో హైటెక్ సిటీలో రంగులు వేసి అభివృద్ధి అంటూ ప్రచారం చేశారని..అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న చోటే పనులు జరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ స్థితి దారుణంగా మారిందని.. వీధి లైట్లు కొనడానికి డబ్బుల్లేని స్థితికి దిగజారిందన్నారు.
హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీయే కాదు.. అంబర్ పేట్, సనత్ నగర్, మల్కాజ్‌గిరి, దిల్ సుఖ్‌నగర్, గౌలిపుర, చార్మినార్, నాంపల్లి, సోమాజిగూడ, ఖైరతాబాద్, కూకట్‌పల్లివంటి ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ నాయకులు విదేశీ పెట్టుబడుల గురించి చెబుతున్నారని.. వాస్తవంగా అవి ఎక్కడికి వెళ్లాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావును గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు.
మాట్లాడితే మతమేగా!
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ‘బీజేపీ నేతలకు మతం తప్ప అభివృద్ధి ధ్యాస లేదు, ఎమ్మెల్సీ ఎన్నికలతో రజకార్ల రాజ్యం ఎందుకు వస్తుందో కిషన్‌రెడ్డికే తెలియాలి. కేంద్రమంత్రిగా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు’ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. బీజేపీ నేతలు రజాకార్ల రాజ్యం రావాలని కోరుకుంటున్నారా? కులం, మతం పేరు చెప్పి ఇంకెన్నాళ్లు పబ్బం గడుపుకోవాలని చూస్తారన్నారు.
శుక్ర వారం ఆయన గాంధీభవన్‌లో ఎంపీ మల్లు రవి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.. లోకల్‌బాడీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నది నిజం కాదా..? సంఖ్యాబలంలేని మీరు ఎవరి ప్రేమ అండదండలు చూసుకుని పోటీ చేస్తున్నారు..? తమకు సంఖ్యాబలం లేదు కాబట్టే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉన్నామని స్పష్టం చేశారు.
రాజకీయ అవసరాలను బట్టి లోకల్‌బాడీ ఎన్నికల్లో మద్దతు గురించి ఆలోచిస్తామని తెలిపారు. తాము ఎవరికి తొత్తుగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి గెలిచామన్నారు. రాజకీయాల్లో దిగజారుడు వ్యాఖ్యలకు తాను వ్యతిరేకమని, కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉంటుందన్నారు.
మీలాగా రహస్య ప్రేమను నడపలేం..
‘కిషన్‌రెడ్డి తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంపీగా, అంబర్‌పేట నియోజకవర్గానికి ఏమి చేశారని అడుగుతున్నా..? కిషన్‌రెడ్డి మగాడు అయితే రాష్ట్రానికి ఏమి చేసిండో చెప్పే దమ్ముందా..? తెలంగాణ బిడ్డగా సిగ్గు అనిపించడం లేదా కిస్మత్‌రెడ్డి..? తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వస్తుంది అనుకోవడం పగటి కల’ అని మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణకు నిధుల సంగతి పక్కనపెడితే.. ప్రధానిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి నిధుల కోసం ఒక్కసారైనా మాట్లాడారా..? అని నిలదీశారు. ఎన్నికలు రాగానే బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ప్రేమ చిగురించడం, ఎన్నికలు అయిపోగానే బద్ధశత్రువుల్లా డ్రామాలు చేయడం పరిపాటిగా మారిందని, మీలాగ రహస్య ప్రేమను నడపడం తమ పార్టీకి అలవాటు లేదన్నారు.
కాళేశ్వరం అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదు..
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. సన్న బియ్యంలాంటి చరిత్రాత్మక నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని, అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి ప్రధాని మోదీ ఫొటోను వేసు కోవాలని సూచించారు.
మెట్రోరైలు విస్తరణ కిషన్‌రెడ్డికి పట్టదా..? నగర ఎంపీగా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మీకు లేదా..? రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ నేతలు వస్తారని, కిషన్‌రెడ్డి రావడానికి సిద్ధమేనా..? అని సవాల్ విసిరారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో చేపట్టిన బీసీ ధర్నాకు రాని బీసీ బిడ్డలైన ఈటల రాజేందర్, బండి సంజయ్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. ఫలాన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి కోరడం లేదని, రాజకీయ సమతుల్యం ఉండాలని కోరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు.