ఇమంది కళ్యాణ్ కృష్ణకు నివాళులు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టియూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ ను వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కోదండరాం శుక్రవారం పరామర్శించారు. ఇటీవల హైదరాబాదులో మరణించిన కళ్యాణ్ కృష్ణ ఉదయ్ కుమార్ కు సోదరుడు. డిసెంబర్ 26వ తేదీ ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో హైదరాబాదు వారాసిగూడలో కళ్యాణ్ కృష్ణ మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంనకు తీసుకువచ్చి కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం కొత్తగూడెం పాత బస్ డిపో ఏరియాలో ఉన్న ఉదయ్ కుమార్ నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అన్నివేళలా తన సహాయ సహకారాలు కళ్యాణ్ కృష్ణ కుటుంబానికి ఉంటాయని అధైర్యపడవద్దని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కోదండరాం యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొనుగోటి సంపత్, వల్లాల భరత్, సాక్షి టీవీ శివ, చందు, ఇమంది హరికృష్ణ, శివ సుమన్ వినయ్ సంపత్ నయీమ్ తదితరులు పాల్గొన్నారు.