calender_icon.png 1 January, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కవితకు అపూర్వ స్వాగతం

29-12-2024 03:26:16 PM

సుదీర్ఘ కాలం తరువాత నిజామాబాద్ పర్యటన

బ్రహ్మరధం పట్టిన ఇందూర్ గులాబీ సైన్యం

తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన కవిత

డిచ్ పల్లి నుంచి సుభాష్ నగర్ వరకు భారీ ర్యాలీ

దారి పొడవునా కవితపై పూల వర్షం

నిజామాబాద్,( విజయక్రాంతి): అక్రమ కేసులో అరెస్ట్, బెయిల్ పై విడుదల, న్యాయ పోరాటం వంటి పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తరువాత ఆదివారం నిజామాబాద్ వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha)కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం 10:00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్ కు చేరుకున్న కవితకు  డిచ్ పల్లి వద్ద బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆత్మీయ స్వాగతం పలికి తమ అభిమానం చాటుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు, హర్షద్వానాల మధ్య పార్టీ ముఖ్య నేతలు గజమాలతో కవితను ఘనంగా సత్కరించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలెత్తుకొని బతుకమ్మలాడుతూ కవిత(Kavitha)ను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. 

పార్టీ నేతలు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన కవిత అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ శ్రేణుల భారీ ర్యాలీ మధ్య ముందుకు సాగారు. పార్టీ కార్యకర్తలు కేరింతలు కొడుతూ కవితపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వద్దనున్న తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పుష్పాంజలి ఘటించారు. అక్కడే జరిగిన ర్యాలీలో స్థానిక ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి ఎమ్మెల్సీ కవిత ప్రసంగించి తనకు అపూర్వ స్వాగతం పలికిన గులాబీ సైన్యానికి జీవితాంతం రుణపడి ఉంటానని తన కృతజ్ఞత చాటుకున్నారు. కాగా కవిత రాక సందర్భంగా అడుగడుగునా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, హోర్డింగులు, పార్టీ పతాకాలు, స్వాగత ద్వారాలతో నిజామాబాద్(Nizamabad) నగరం గులాబీమయమైంది. ఎమ్మెల్సీ కవితకు  స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్, బోధన్ ఇంఛార్జ్ షకీల్ ఆయేషా ఫాతిమా, మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.