calender_icon.png 31 January, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో భయంకరమైన రోజులు వచ్చాయి

30-01-2025 07:09:03 PM

కాంగ్రెస్ దుష్పరిపాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి

 కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర, దగా చరిత్ర

అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు

130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది..?

తెలంగాణ దుస్థితిపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకరమైన రోజులు వచ్చాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన వల్ల తెలంగాణ వందేళ్లు వెనక్కివెళ్లి పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) విఫలమైందని, అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని విరుచుకుపడ్డారు. అబద్దం అద్దం ముందు నలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టి ఎక్కువకాలం పరిపాలించలేరని స్పష్టం చేశారు. అలవిగాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. గురువారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారని గుర్తు చేసన ఎమ్మెల్సీ కవిత... 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుందని ప్రశ్నించారు. చేతిలో ఎర్రబుక్కు పట్టికొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. గతంలో తెలంగాణను ఆంధ్రలో కలిసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర, దగా చరిత్ర అని విరుచుకుపడ్డారు.

ఇటీవల గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని చెప్పారు. రైతు భరోసా, రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని, సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్దీదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారని వివరించారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తాము చెప్పినవాళ్ళకే పథకాలు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారని, ఈ వైఖరి సరికాదని సూచించారు. గతంలో కేసీఆర్ అర్హులైన అందరికీ పారదర్శకంగా పథకాలను అందించారని, కేసీఆర్ హయాంలో నేరుగా లబ్దీదారులకే కోట్లాది రూపాయలు వెళ్లాయని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన వాటినే అటూ ఇటూ మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులను తామే చెశామని చెప్పడమే తప్పా ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. కాగా, యూరియా కోసం రైతులు మళ్లీ లైన్లు కట్టే పరిస్థితి వచ్చిందని, కరెంటు ఎప్పుడొస్తుందా ఎప్పుడు పోతుందా అన్నది తెలియని దుస్తితి ఏర్పడిందని, చెరువులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.

నిజామాబాద్ జిల్లాకు నీళ్లిచ్చే కాళేశ్వరం(Kaleshwaram) ప్యాకేజీ 21 పనులు పూర్తి చేయని చేతగాని ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం అమలు చేయడం లేదని ఎండగట్టారు. పెన్షన్ మొత్తాన్ని పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లే ఇంకా ఇస్తున్నారని, పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని వివరించారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలను స్కూటీలు ఏమైయ్యాయని అడిగారు. ఎల్లారెడ్డి పాఠశాలలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థ్యతకు గురికావడం బాధాకరమన్నారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను కూడా నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్రవీడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పసుపు పంట మార్కెట్ కు వస్తున్న నేపథ్యంలో కనీస మద్ధతు ధర ప్రకటించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరువ తీసుకోవాలని డిమాండ్ చేశారు.