calender_icon.png 13 May, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన కళ్ళముందే తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు

22-04-2025 12:04:57 AM

తెలంగాణను కాపాడుకోటమే బి.ఆర్ ఎస్ కార్యకర్తల ప్రధమ కర్తవ్యం

కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తాను

 ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్న ప్రసంగించిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

భద్రాచలం,(విజయక్రాంతి): కేంద్రంతో ఎంతో పోరాడి చివరకు ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ మన కళ్ళ ముందే ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని రాష్ట్ర తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. భద్రాచలం హరిత హోటల్ లో సోమవారం జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమకారులు,టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు తేలేదని, ఆత్మీయ భరోసా కింద నిరుపేదలకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. మన కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉందన్నారు. 

అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విపరీతమైన అబద్దాలు చెబుతున్నారనీ, 2004లో చచ్చిన పీనుగలా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. 2004లోనే తెలంగాణ ఇచ్చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పదేళ్లు ప్రజలను ఏడిపించిందని, వందలాది మంది బిడ్డలను పొట్టనపెట్టుకొని తెలంగాణ ఇచ్చారు తప్పా ఉట్టిగా ఇవ్వలేదని అన్నారు. రూ లక్షా 60 వేల కోట్లుపైగా అప్పు తెచ్చిన సర్కారును ప్రశ్నిస్తే బుకాయిస్తున్నారని, తెచ్చిన రుణాన్ని ఏం చేశారని అడిగితే చెప్పబోమని చెబుతున్నారని అన్నారు. తెచ్చిన అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్  చేశారు. రూ 40 వేల కోట్ల విలువైన భూములను రూ 10 వేల కోట్లకు ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, ఆ రూ 10 వేల కోట్లతో రైతు భరోసా, రుణ మాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారని, ఇప్పటికీ 60 శాతం మందికి రుణ మాఫీ కాలేదన్నారు. 50 శాతం మందికి రైతు భరోసా రాలేదన్నారు.  ఈ రూ 10 వేల కోట్లు ఎక్కడ పోయినట్లు ? అని ఆమె ప్రశ్నించారు.

పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. లేనిపోని హామీలిచి అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత కేసీఆర్ దే నని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా కేసీఆర్ పనిచేసినట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు అందించారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని, తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లా నుంచి 1969లో ఖమ్మంలో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రమంతా పాకినట్లు తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ద్రోహి అని, భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే  మరలా గెలిచేది బిఆర్ఎస్ పార్టీయేనని ఆమె ఘంటపదంగా తెలిపారు. కవిత వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన రావు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, బిఆర్ఎస్ నాయకులు హరిప్రియ, రావులపల్లి రాంప్రసాద్ ,బోదె బోయిన బుచ్చయ్య, మానే రామకృష్ణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.