13-02-2025 12:00:00 AM
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ
ఖమ్మం, ఫిబ్రవరి -12 (విజయక్రాంతి) : జిల్లాలో ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. ఈ నెల 27న జిల్లాలో నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొ న్న జిల్లా రెవెన్యూ అధికారిణి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరికి అనుభవం ఉందని, ఎక్కడా తేలికగా తీసుకోకుండా ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వ హించాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో 4112 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని, వీరి కోసం 24 పోలింగ్ కేంద్రాలను సిద్దం చేశామని, నిబంధనలు పాటిస్తూ పోలింగ్ సజావుగా జరపాలని అన్నారు.
నామినేషన్లు ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 13న ముగుస్తుందని, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు గురువారం వరకు తెలుస్తాయని అన్నారు. ఎన్నికల విధుల పట్ల ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని, శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అంతకుముందు మాస్టర్ ట్రైనర్ లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా ఉపాధికల్పన అధికారిణి మాధవి పోలింగ్ నిర్వహణపై వివరిస్తూ ఫిబ్రవరి 27న ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగనున్నదని, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై సిబ్బంది అవగాహన కల్పించుకోవాలని, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ విధానంతో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.