10-02-2025 07:41:20 PM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావులతో కలిసి కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా పర్యవేక్షించాలని, ప్రిసైడింగ్ అధికారి డైరీపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
టెండర్ ఓట్ చాలెంజ్ ఓటులో ప్రతి కవర్ పై అవగాహన పెంచుకోవాలని, అదనపు పోలింగ్ అధికారి, పోలింగ్ క్లర్కులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని, ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు, ఉపయోగించని బ్యాలెట్ పేపర్ల వివరాలు నమోదు చేయాలని, వ్యాలెట్ పేపర్లు వరుస సంఖ్యలో ఉండేలా చూడాలని తెలిపారు. ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయని, బ్యాలెట్ బాక్సులపై ఏజెంట్ల సమక్షంలో సీలువేయాలని, ప్రిసైడింగ్ అధికారి ప్రతి సమాచారాన్ని డైరీలో నమోదు చేయాలని తెలిపారు.
పోలింగ్ సిబ్బందితో పాటు సూక్ష్మ పరిశీలకులు కూడా విధులు నిర్వహిస్తున్నారని, జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, పోలింగ్ నిర్వహించే సిబ్బంది ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని, వారంలోగా ఇంకోసారి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, తహసీల్దారులు రామ్ మోహన్, రోహిత్, ప్రిసైడింగ్ అధికారులు, అదనపు డిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.