27-02-2025 02:05:26 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): ఏం.ఎల్.సి. ఎన్నికలు సజావుగా ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ నెల 27 న జరుగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. 8 రూట్లలో 54 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికలు నిర్వహణకు 48 మంది ప్రెసిడింగ్ అధికారులు, 48 మంది సహాయ ప్రెసైడింగ్ అధికారులు, 116 మంది ఒపిఒ లను, 52 మంది మైక్రో పరిశీలకులను నియమించడం జరిగిందని తెలిపారు. ఏం.ఎల్.సి.పట్టభద్రుల నియోజక వర్గానికి 29 పోలింగ్ కేంద్రాల్లో 16410 మంది ఓటర్లు ఉండగా ఇందులో 11616 మంది పురుషులు, 4793 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్, ఉపాధ్యాయ నియోజక వర్గంలో 25 పోలింగ్ కేంద్రాల్లో 2011 మంది ఓటర్లు కాగా, ఇందులో 1307 మంది పురుషులు, 704 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
పోలింగ్ రోజున ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని, ప్రతీ రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలియపరచాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్, సీపీఒ రాజారాం, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.