టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్
మెదక్, జనవరి 30(విజయక్రాంతి) ః ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ ,మెదక్ - నిజామాబాద్- అదిలాబాద్ - ఉపాధ్యాయ నియోజకవర్గం, పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల తేదీలను గురువారం ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ కు సంబంధించి సంబంధిత ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న జారీ అవుతుందని, నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10న, స్కృట్నీ 11న, నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 13 అని తెలిపారు.
పోలింగ్ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగనుందన్నారు. ఓట్ల లెక్కింపు మార్చి 3న ప్రారంభమవుతుందని, ఎన్నికల ప్రక్రియను మార్చి 8 లోగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణమే అమలులోకి వస్తుందని, మార్గ దర్శకాలను ఉల్లంఘిస్తే ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్డిఓ శ్రీనివాసరావు, సంబంధిత ఆర్డీవోలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.