calender_icon.png 19 October, 2024 | 7:15 AM

ఎమ్మెల్సీ.. పోటాపోటీ!

19-10-2024 12:50:21 AM

  1. టికెట్‌పై ఆశతో కొందరు
  2. టికెట్ రాకున్నా మరికొందరు 

కరీంనగర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేతలు ప్రచారాన్ని విస్తృతం చేశారు. నవంబర్ 6కు పట్టభద్రుల ఓటరు ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ ముగియనుండగా, పోటీకి సిద్ధమవుతున్నవారంతా ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టిసారిస్తున్నారు.

కరీంనగర్ అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి ప్రచారంలో ముందున్నారు. ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ రాకున్నా బరిలో ఉంటానని ప్రకటించారు. మిస్డ్‌కాల్ ద్వారా ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను  ప్రారంభించిన ఆయన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించే పనిలోపడ్డారు.

కాంగ్రెస్ నుంచే టికెట్ ఆశిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ సైతం ప్రచారం ముమ్మరం చేశారు. టికెట్ రాకుంటే పోటీలో ఉంటారా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. మరోనేత మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ సైతం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన స్వంత జిల్లా మెదక్ ఉమ్మడి జిల్లాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.  

బీఆర్‌ఎస్ టికెట్‌కు పోటీనే..

బీఆర్‌ఎస్ తరఫున మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ట్రస్మా నాయకుడు యాదగిరి శేఖర్‌రావు, డాక్టర్ బీఎన్‌రావు ప్రయత్నిస్తున్నారు. రవీందర్‌సింగ్‌వైపే అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో శేఖర్‌రావు ఓపక్క ప్రయత్నం చేస్తూనే, మరోపక్క విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టికెట్ వచ్చినా రాకున్నా పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

డాక్టర్ బీఎన్ రావు మాత్రం బీఆర్‌ఎస్ టికెట్ ఇస్తేనే పోటీలో ఉంటానని చెప్తున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సీనియర్ నాయకుడు పొల్సాని సుగుణాకర్‌రావు, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ భోగ శ్రావణి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేసిన రాణిరుద్రమ, ఏబీవీపీ నాయకుడు రఘు ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్నారు.

తాజాగా సంగారెడ్డికి చెందిన డిష్ మోహన్‌రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. టికెట్ ఆశిస్తున్నవారిలో ప్రస్తుతం పొల్సాని సుగుణాకర్‌రావు ప్రచారంలో ముందున్నారు. అధిష్ఠాణం ఆయనకు అవకాశం ఇస్తుందన్న ఆశలో ఉన్నారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఆయా పార్టీలు సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.