calender_icon.png 27 December, 2024 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ బరి.. ఆశావహుల గురి!

07-11-2024 12:45:42 AM

  1. సీటు కోసం గులాబీ పార్టీలో ఫైటు
  2. అధినేత కేసీఆర్ మదిలో ఎవరి పేరో?
  3. తెరపైకి టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్ పేరు!
  4. నోటిఫికేషన్ నాటికి ప్రకటించే అవకాశం

కరీంనగర్, నవంబర్ ౬ (విజయక్రాంతి): కరీంనగర్ మెదక్ నిజామాబాద్‌ేొఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే బీఆర్‌ఎస్ ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్టీఏ అధికారి చంద్రశేఖర్‌గౌడ్‌కు బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. కానీ, పార్టీ అభ్యర్థిగా ప్రకటించలేదు. ఈసారి ప్రతిపక్షంలో ఉండి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచనతో గెలుపు గుర్రం కోసం అన్వేషణ చేస్తున్నది.

ఈ క్రమంలో గులాబీ టికెట్ కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. అయితే, కేసీఆర్‌ను కలిసి ఆశీస్సులు కోరుతున్న వారందరిని మీరు పనిచేసుకోండని భుజం తడుతుండటంతో ఆయన మద్దతు తమకే ఉంటుందన్న ఆశతో అభ్యర్థులు ఎవరికి వారే ప్రచారంలో దిగారు. 

ప్రచారంలోకి ఆశావహులు 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అందరికంటే ముందే కరీంనగర్ మాజీ మేయర్, పౌరసరఫరాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ప్రచారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో రవీందర్‌సింగ్ టికెట్ ఆశించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా టికెట్ ఆశించినప్పటికీ అధిష్ఠానం భానుప్రసాదరావు, ఎల్ రమణకు కేటాయించింది. అప్పుడు రవీందర్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు.

ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ తనకే వస్తుందన్న ఆశతో ఉన్నారు. ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వాల్మీకి శేఖర్‌రావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్‌రావు సైతం టికెట్లు ఆశిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమిల్ల రాకేశ్‌కుమార్ కేసీఆర్‌ను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

సివిల్ ఇంజినీర్ అయిన రాకేశ్ పెద్దపల్లి జిల్లాకు చెందినవారు. 20 ఏండ్లుగా పార్టీని అంటిట్టుకొని కేసీఆర్ కుటుంబానికి నమ్మినబం టుగా, పార్టీలో క్రమశిక్షణ గల నాయకునిగా ఉంటున్నారు. పార్టీ తనకు అవకాశమిస్తే పోటీ చేస్తానని, వేరేవారికి  టికెట్ ఇచ్చినా వారికి సహకరిస్తానని రాకేశ్ ‘విజయక్రాంతి’తో చెప్పారు. 

టీఎన్జీవో నేత దేవీప్రసాద్

టీఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గుండవరపు దేవిప్రసాదరావు కూడా బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం లో టీఎన్జీవో నేతగా ఉద్యమానికి అండగా నిలిచి కేసీఆర్‌కు దగ్గరయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు.

దేవిప్రసాద్ సిద్దిపేట జిల్లాకు చెందినవారు. గతంలో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఎన్జీవో సం ఘం నాయకుడు స్వామిగౌడ్‌ను బీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలవగా ఆయన గెలిచి, శాసనమండలి చైర్మన్‌గా కొనసాగారు. తనకు అవకాశం ఇస్తే పార్టీకి విధేయుడిగా ఉంటానని దేవి ప్రసాద్ పేర్కొంటున్నారు. 

హోరాహోరీ తప్పదు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. వచ్చే మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చిన పేర్లకు తోడు ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి మరికొందరి పేర్లు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెంచుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి నిలబెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో బీఆర్‌ఎస్ నేతలు ఉన్నట్టు తెలిసింది. గతంలో కంటే ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీదారుల సంఖ్య పెరిగి హోరాహోరీ పోరు అనివార్యం కానుంది.