మహబూబ్ నగర్: క్రీడల్లో గెలుపు ఓటమిలో సహజమని క్రీడాస్పూర్తిని ప్రతి ఒక్కరు అవలంబించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 5వ అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ 2024 టౌర్నమెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పతాకం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో ఆదివారం వివిధ జిల్లాల కు చెందిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేయగా, క్రీడాకారుల చేత గౌరవ వందనం స్వీకరించి బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా వ్యవహారాలు సలహాదారు ఎపి జితేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే అసెంబ్లీ బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులను వెలికితీసేందుకు త్వరలో సియం కప్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టౌర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా వ్యవహారాల సలహాదారు ఎపి జితేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, ఎన్ పి వెంకటేష్, డివైఎస్ఓ శ్రీనివాస్, లక్ష్మణ్ యాదవ్, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జాకేర్ అడ్వకేట్, ప్రధాన కార్యదర్శి నసారుల్లా హైదర్ తదితరులు పాల్గొన్నారు.