calender_icon.png 3 April, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాయ మాటలు చెప్పం.. మంచి పనులు చేస్తాం

02-04-2025 08:24:37 PM

-దేశ చరిత్రలోనే మన దగ్గరే సన్న బియ్యం పంపిణీ..

-సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మాయ మాటలు చెప్పి ప్రజలను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం హన్వాడ మండల కేంద్రంలోని చౌక ధర దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగా, మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. 

గత ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని రేషన్ షాపుల్లో కేవలం దొడ్డు బియ్యం మాత్రమే పంపిణీ చేశారని, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న తొమ్మిది రకాల సరుకులను ఆపివేసిందని ఆయన చెప్పారు. గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బిఆర్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్విర్యం అయ్యాయని అన్నారు. అనంతరం హన్వాడ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే  గురుకుల పాఠశాలను సందర్శించి,  విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అద్దె భవనంలో గురుకుల పాఠశాల ఉండడంతో తరగతి గదులు సరిపోవడం లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే నాలుగు గదులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 

అలాగే గురుకుల పాఠశాల నూతన భవనం నిర్మాణానికి హన్వాడ మండలంలోని ఏనిమిది తాండలో వెంటనే 5 ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించాలని మండల తహసీల్దార్ కి ఆదేశాలు జారీ చేశారు. సొంత భవనం కోసం భూమిని కేటాయించడంతో పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, ఎం.కృష్ణయ్య యాదవ్, వెంకటాద్రి, రామకృష్ణ, గండిడ్ నర్సింహులు, శేఖర్ నాయక్, శేఖర్, షబ్బీర్ హుస్సేన్, బుద్దారం సుధాకర్ రెడ్డి, నవనీత, తిరుపతయ్య, కృష్ణయ్య, నర్సింహులు, సంజీవ్ రెడ్డి, కావలి శ్రీనివాస్, షబాజ్, రఘుపతి రెడ్డి, మండల తహసీల్దార్, ఎంపిడిఓ తదితరులు పాల్గొన్నారు.