15-02-2025 02:33:11 PM
బంజారా బిడ్డలకు నిరంతరం అండగా ఉంటాం
సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ : బంజారా బిడ్డలకు అండగా ఉంటానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahabubnagar MLA Yennam Srinivas Reddy) భరోసా ఇచ్చారు. మహబూబ్ నగర్ పట్టణం లోని అయ్యప్ప కొండపై కొలువైన సేవాలాల్ మరియమ్మ యాడి ఆలయం ఆవరణలో జరిగిన బోగ్ బండార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ సేవాలాల్ మహారాజ్(Sant Sevalal Maharaj) ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ దగ్గర నిర్వహించిన సేవాలాల్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారా బిడ్డలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం లో అధికారం చేపట్టిన తరువాత ప్రతి తాండా కు బిటి రోడ్డు వేయాలనే సంకల్పం తీసుకున్నారని, అందులో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ, మహబూబ్ నగర్(Mahbubnagar)లో ఉన్న తాండా లలో బిటి రోడ్డు పనులకు 5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
రానున్న నాలుగు సంవత్సరాలలో ప్రతి తాండా కు బిటి రోడ్ వేస్తామని స్పష్టం చేశారు. బంజారా లిపి గోర్ గోలి(Banjara script gore goli) ఉందని తెలిసిందని, ముందుగా పెద్ద బాలశిక్ష తయారు చేయించి మీ పిల్లలకు నేర్పించాలని, అలాగే ఈ లిపిని 8 వ షెడ్యూల్ లో పొందుపర్చుకోవాలని తద్వారా మన బంజారా బిడ్డలకు ఉపాధి తో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్ విద్యా నిధి లో పది శాతం గిరిజన బంజారా విద్యార్థులకు కేటాయిస్తామని హామి ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కొన్నే ఉంటాయని, కాబట్టి మన బిడ్డలు వెయ్యి మంది కి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగే విధంగా మీరు తర్ఫీదు ఇవ్వాలని, గొప్ప లక్ష్యాలను సాధించేందుకు వారిని తయారు చేయాలని ఆయన సూచించారు. మీకు బ్యాంకు ద్వారా కోట్ల రూపాయలు ఫండ్ వచ్చే అవకాశం ఉందని కాబట్టి బంజారా బిడ్డలను పరిశ్రామికవేత్తలు గా తయారు చేయాలని, అందుకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి(culture of banjara tribe)ని సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలని, వాటిని ఎప్పటికి విడనాడవద్దని ఆయన కోరారు . వచ్చే ఏడాది మరింత వైభవంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు జరుపుకుందాం అని ఆయన అన్నారు.
అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ డి జానకి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు ఆర్.శేఖర్ నాయక్, కె.శేఖర్ నాయక్, చందర్ నాయక్, చత్రునాయక్, దేవుజా నాయక్, రాము నాయక్, గంగా రామ్ నాయక్, నార్యా నాయక్, గోపాల్ నాయక్, చంద్ర నాయక్, సుభాష్ నాయక్, దశరథ్ నాయక్, తానాజీ, లక్ష్మణ్ నాయక్, సంతోష్ నాయక్, రాంనాయక్, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.