* భ్రమరాంబిక ఆలయం వద్ద హైడ్రామా..
* మాజీ ఎమ్మెల్యే గువ్వల, పోలీసుల మధ్య వాగ్వాదం
నాగర్కర్నూల్ జనవరి 15 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో హైటెన్షన్ నెలకొంది. భ్రమరాంబిక ఆలయంలోకి ప్రవేశించేందుకు తనను అనుమతించలేదని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాదనకు దిగారు.
ఉమామహేశ్వర ఆలయంలో జరిగే జాతరకు ముందు అచ్చంపేటలోని భ్రమరాంబిక దేవికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం నుంచి చీరాసారే గంధంతో ప్రభ ఉత్సవం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సైతం ఆలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు.
కానీ మొదటగా స్థానిక ఎమ్మెల్యే పూజలు నిర్వహించడం ఆనవాయతీ. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దంపతులు మొదట పూజలు నిర్వహిస్తున్న క్రమంలో అదే సమయంలో గువ్వల బాలరాజు సైతం ఎంట్రీ ఇచ్చారు. దీంతో శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో పోలీసులు వారిని కొద్దిసేపు నిలువరించారు.
తనను ఆలయంలోకి వెళ్లేకుండా పోలీసులతో అడ్డుకున్నారని నిరసిస్తూ గువ్వల రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొద్దిసేపు హైడ్రామా అనంతరం మీడియాతో మాట్లాడి వెనుదిరిగారు.
స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వామి మాలలో ఉండి కూడా గుడి వద్ద రాజకీయం చేస్తున్నాడంటూ గువ్వల వాదించగా, ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ఓటమి పాలైనా తానే ఎమ్మెల్యేగా ఊహించుకుంటూ గువ్వల బాలరాజు హంగామా చేస్తున్నాడని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.