బెల్లంపల్లిలో గోదావరి నీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. కన్నాల మిషన్ భగీరథ కార్యాలయం వద్ద అమృత్ 20 పథకం ద్వారా రూ61.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పట్టణ త్రాగునీటి గోదావరి జలాల సరఫరా పనులకు ఆయన లాంఛనంగా భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ 72 వేల జనాభా కలిగిన బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇంటర్నల్ ఫోర్స్ ద్వారా ఈ పథకాన్ని పూర్తిచేయనున్నట్లు చెప్పారు. పనులను 11 నెలల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ప్రాంతానికి నూతన డంప్ యార్డ్ కూడా మంజూరైనట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో పాలుపంచుకుంటూ బెల్లంపల్లి ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తాను క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ,ప్రతి సమస్యను పరిష్కరించి దిశగా పనిచేస్తానని అన్నారు. మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత మాట్లాడుతూ ఎమ్మెల్యే వినోద్ బెల్లంపల్లి అభివృద్ధి కోసం రూ 100 కోట్ల నిధులను కేటాయించి ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా సహకరించారని అన్నారు.
అనంతరం కన్నాల ప్రాంతంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ కుమార్, బెల్లంపల్లి ఆర్డీవో హరి కృష్ణ, తహసిల్దార్ జ్యోత్స్న, బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్, కౌన్సిలర్ బండి ప్రభాకర్, ముచ్చర్ల మల్లయ్య, ఎం సూరిబాబు,నాయకులు రుద్రభట్ల సంతోష్, బొమ్మెన హరీష్ గౌడ్, మాధవరపు నర్సింగరావు, గెల్లి రాజలింగు, దావ రమేష్ బాబు, నాతరి స్వామి, లెక్కల శ్రీనివాస్ , ముడిమడుగుల మహేందర్ ,మునిమంద రమేష్, చిలుముల శంకర్ ,మంద అనిత, కౌన్సిలర్లు అప్సర్, సురేష్ లతోపాటు మహిళా నాయకురాళ్ళు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.