ఆదిలాబాద్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఆస్పత్రులపై ఎంతో నమ్మకంతో వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వారికి అందిస్తున్న వైద్య సేవలపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డైరెక్టర్ కు సూచించారు. వైరల్ జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.