ఇరు వర్గాల ప్రజలు సంయమనం పాటించాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
కొమురం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జైనూర్ మండలంలో ఓ ఆదివాసీ మహిళపై అఘాత్యానీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని జైలుకు పంపారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... జైనూర్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఘటన బాధాకరమని అన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు సీతక్క డిజీపి లతో మాట్లాడి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.
ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోరారు. ఆదివాసీలను అడ్డంపెట్టుకొని కొందరు ప్రశాంతవంతమైన వాతావరణాన్ని చెడగొట్టే కుట్ర పన్నుతున్నారని, ఈ ఘటనలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు హస్తం ఉందని ఆరోపించారు. అమాయక ఆదివాసి యువతను మభ్యపెట్టి వారి జీవితాన్ని సర్వ నాశనం చేయడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్ర పన్నుతున్నాయని, ఆదివాసి యువత ఎవరో చెప్పిన మాటలు విని ఆగం కావొద్దని విజ్ఞప్తి చేశారు. సార్మెడీలు, పటేల్లు ఆదివాసీ యువతను మంచి మార్గం వైపు నడిపించాలని కోరారు. ఘటన జరగడానికి ముందు డిఎస్పీ వ్యవహరించిన తీరు పై డీజీపి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జెల్లడానికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు యత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి హింసాత్మాకమైన ఘటన జరగడానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.