calender_icon.png 10 March, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే స్టిక్కర్లు దుర్వినియోగం

10-03-2025 12:20:30 AM

  • ఇతరుల వాహనాలకు స్టిక్కర్లు వీటితో వీఐపీలుగా చలామణి 
  • పోలీసు సైరన్‌లు కూడా....పట్టించుకోని అధికారులు 

మేడ్చల్, మార్చి 9 (విజయ క్రాంతి): ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ఇచ్చే విఐపి స్టిక్కర్లు దుర్వినియోగం అవుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధం లేని వారు, చోటామోటా నాయకులుగా చలామణి అవుతున్నవారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు తమ వాహనాలకు స్టిక్కర్ అతికించుకొని వీఐపీలుగా తిరుగుతున్నారు. వివాదం జరిగినప్పుడు స్టిక్కర్ల దుర్వినియోగం బయటపడుతోంది.

రెండు రోజుల క్రితం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనాన్ని అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వాహనం ఎవరిదని విచారిస్తే ఎమ్మెల్యేకు సంబంధం లేదని తేలింది. ఆ స్టిక్కర్ వాహనదారుడికి ఎలా వెళ్లిందనేది విచారించా ల్సిన అవసరం ఉంది.

ఈ వాహనాన్ని ఎం ఎల్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి నడిపినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. స్టిక్కర్ పై ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. మాజీమంత్రి మల్లారెడ్డి కే చెందిన స్టిక్కర్ గతంలోనూ రాజకీయ దుమారం లేపింది. 2022లో క్యాసీనోతో సంబంధం ఉన్న వ్యక్తి అప్పట్లో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి స్టిక్కర్ ను తన వాహనానికి అతికించుకున్నట్లు తేలింది.

దీనిపై అప్పట్లో మల్లారెడ్డి తనదైన స్టైల్‌లో వివరణ ఇచ్చారు. గడువు తీరడంతో తాను పడేశానని, పడేసిన స్టిక్కర్ ఎవరో వాడితే తనకేమి సంబంధం అని ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతం గడువు ఉన్న స్టిక్కర్ ఇతరుల వాడి ప్రమాదానికి కారణమయ్యారు. దీనికి మల్లారెడ్డి సమా ధానం ఏమి చెబుతారో?

ఏటా మూడు స్టిక్కర్లు 

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ప్రతి ఏటా మూడు స్టిక్కర్ లు ఇస్తుంది. ఏదైనా కారణంతో పాడైతే కొత్తవి తీసుకోవచ్చు. ఈ స్టిక్కర్ల కారణంగా ఎమ్మెల్యేలకు గుర్తింపుతో పాటు, టోల్ గేట్ల వద్ద డబ్బులు చెల్లించకుం డా వెళ్లే వీలుంటుంది.

వీటిని ఎమ్మె ల్యేలకు సంబంధం లేని వారు వాడడం వల్ల ప్రమాదాలు, వివాదాలకు కారణమవుతున్నారు. స్టిక్కర్లు దుర్వినియోగం అవుతున్న సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో వడం లేదు. పోలీసుల తనిఖీల సమయం లో స్టిక్కర్ తో వచ్చిన వాహనాలను తనిఖీ చేయకుండా వదిలేస్తున్నారు. 

ఎమ్మెల్యే స్టిక్కర్ల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విమర్శలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. స్టిక్కర్ ఇచ్చే సమయంలో వాహనం నంబర్‌తో ఇవ్వాలని, ఇతరులు వాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

పోలీస్ సైరన్ కూడా...

ఎమ్మెల్యే స్టిక్కరే కాకుండా, పోలీసు సైరన్ కూడా దుర్వినియోగం అవుతోంది. పోలీసు సైరన్ మోగి స్తూ ప్రైవేటు వాహనదారులు దర్జాగా వెళ్తున్నారు. ట్రాఫిక్ ఉన్న సమయంలో పోలీస్ సైరన్ మోగించడంతో పోలీసు వాహనంగా భావించి వాహనదారులు సైడ్ ఇస్తున్నారు. మేడ్చల్ పట్టణంలోనూ పోలీసు సైరన్ వాహనాలు తిరుగుతున్నాయి. పోలీస్ సైరన్ దుర్వినియో గం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.