జగిత్యాల అర్బన్, జనవరి 9: నిధుల కొరతతో అసంపూర్తిగా ఉన్న వైద్య కళాశాల భవన నిర్మాణా నికి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ వినతి చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్ పలు సమస్యలపై చర్చించి, వినతి పత్రాన్ని అందజేశారు.
జగిత్యాల పట్టణములో మంజూరైన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు నిధుల కొరతతో అర్ధాంతరంగా ఆగిపోయాయని, దీంతో కళాశాల నిర్వహణ ఇబ్బందిగా మారిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ పోస్ట్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో నిర్వహణ కష్టంగా ఉందన్నారు.
వైద్య కళాశాలకు అనుబంధ 200 పడకల ఆసు పత్రి మంజూరీ కాలేదని, దీంతో వైద్య కళాశాల గుర్తింపుకు ఇబ్బందిగా ఉంటుందని వెంటనే వైద్య కళాశాల భవనంతో పాటూ అనుబంధ అసుపత్రి మంజూరీ చేయాలని మంత్రిని కోరారు. ఖాళీగా వున్న, ప్రిన్సిపల్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ పోస్ట్లు భర్తీ చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే డా.సంజయ్’కుమార్ తెలిపారు.