జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్
జగిత్యాల,(విజయక్రాంతి): నిరుపేదల చిరకాల స్వప్నం సొంతింటి కల శరవేగంతో నెరవేరుద్దాం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నూకపల్లి లో డబుల్ బెడ్ రూం నిర్మాణాలు, 32.36 కోట్లతో జరుగుతున్న డ్రైనేజి, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, రోడ్డును శుక్రవారం పరిశీలించి పనులను వేగంగా పూర్తి చేసేందుకు తగు చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. న్యాక్ సెంటర్, ఏటీసీ సెంటర్ పనులను, టిఆర్ నగర్ లో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమం, బాలికల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి పనులు పూర్తి చేసేందుకు బ్యాలెన్స్ నిధుల కోసం వెంటనే అంచనాలను తయారు చేసి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తదుపరి జగిత్యాల పట్టణంలో నిర్మించిన వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను వెనువెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేసి నిరుపేదల చిరకాల స్వప్నాలు నెరవేరుద్దాం అని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధు సూధన్, ఈఈ పిఆర్ రెహమాన్, శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలువాల జ్యోతి, డిప్యూటీ ఇఇ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.