25-02-2025 01:28:28 AM
మార్చి 29 నాటికి పదవీకాలం ముగియనున్న ఐదుగురు ఎమ్మెల్సీలు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : రాష్ట్ర శాసనమండలిలో ఖాళీకా నున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల (ఎమ్మెల్యే కోటా) ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవా రం ప్రకటించింది. తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబం ధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించడంతో.. సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ విడు దల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 3ననోటిఫికేషన్ విడుదల చేస్తారు.
నామినేషన్లకు ఆఖరు తేదీ మార్చి 10. దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ మార్చి 11న చేపడతారు. మార్చి 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచికూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేషం, మీర్జా రియాజుల్ హనస్ ఎఫెండిల పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఎమ్మెల్యేల కోటాలో ఈ ఐదు స్థానాలను మార్చి 24లోపల ఎన్నికలు నిర్వహించి భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ ఐదు స్థానాలకు ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.