calender_icon.png 18 November, 2024 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా, వైద్యంపై రాజకీయాలు వద్దు

09-11-2024 07:17:21 PM

కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.. ఆపుతున్నా..!

బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే పీఎస్ఆర్ 

మంచిర్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కావాల్సుకొని బీఆర్ఎస్ నాయకులు దీనిని రాజకీయం చేస్తున్నారని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. శని వారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడ సాయికుంటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురైన పదవ తరగతి విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుందన్నారు. చరిత్రలోనే డైట్ చార్జీలు 40 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ దేనని, దీనితో పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందుతుందన్నారు. కాస్మోటిక్ చార్జీలు సైతం పెంచి ఇచ్చామన్నారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 216 మందికి 180 మంది ప్రజెంట్ గా ఉన్నారని, ఇందులో 12 మందికి వాంతులయ్యాయని, ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించారన్నారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని, అప్పటి మంత్రి హరీష్ రావుకు డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

రాజకీయాలుంటే బయట చేసుకోవాలి కానీ విద్యార్థుల మీద కాదన్నారు. మీకు వార్నింగ్ అనుకున్నా, హెచ్చరికా అనుకున్నా పర్వాలేదు, మంచిర్యాల నియోజక వర్గానికి మంచి చేయాలనుకుంటున్నాం, దీనిని చెడగొట్టవద్దన్నారు. అవసరమైతే పదేండ్ల డాటాతో చర్చకు రండీ, పది నెలల్లో చేసిన అభివృద్ధి చూపిస్తానన్నారు. విద్యార్థులు అస్వస్థతకు కారణం వైద్య కారణాలు కావని, అధికారులు, విలేకరులు వారిని ఏం జరిగిందంటూ అందరు అడగడంతో స్ట్రెస్తోనే ఈ సమస్య ఏర్పడిందని, దీనిని రాజకీయం చేయవద్దన్నారు.

తప్పుడు ప్రచారాలు చేస్తుంటే మా కార్యకర్తలు ఊరుకోరని, అసలే ఆగ్రహంతో ఉన్నారని, వారు తిరుగబడితే మీరు ఎక్కడుంటారో నాకే తెలియదని, నేను దేనిని రాజకీయం చేయదలచుకోవడం లేదని, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చిల్లర పనులు మానుకోవాలని ఆగ్రహంతో హెచ్చరించారు. అనంతరం చున్నంబట్టి వాడ సాయికుంటలో స్పోర్ట్స్ స్టేడియం స్థలాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులున్నారు.