కాంగ్రెస్ నాయకులు
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై అసత్య ఆరోపణలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావుకు కాంగ్రెస్ నేతలు సూచించారు. రఘునాథ్ రావు ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలకు స్వస్తి పలకక పోతే మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావుకు పట్టిన రాజకీయ సమాధి తప్పదన్నారు. ఎమ్మెల్యేకు చట్టంపై, ప్రభుత్వ నిబంధనలపై గౌరవం ఉందని తెలిపారు. ఇంజనీర్ ల వ్యవహరిస్తున్నాడని విమర్శలు చేయడం తగదని, ఎమ్మెల్యే ఏ వన్ కాంట్రాక్టర్ గా పని చేసిన అనుభవం ఉందన్నారు.
ఓటు వేయలేదనే అక్కసుతో మార్కెట్ రోడ్డులో కూల్చివేతలు చేస్తున్నారనే ఆరోపణలు విడ్డురంగా ఉన్నాయని విమర్శించారు. ఓట్లు ఎవరికి వేశారో ఎలా తెలుస్తుందో విద్యావంతుడైన రఘునాథ్ రావు చెప్పాలని అన్నారు. రోడ్డుపై అక్రమ నిర్మాణాలు ఉన్నందునే వాటిని తొలగిస్తున్నారు. శ్రీరాంపూర్ లో పది ఎకరాల స్థలంలో డంప్ యార్డు నిర్మాణం కోసం అటవీశాఖ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 63వ జాతీయ రహదారి నిర్మాణం మాస్టర్ ప్లాన్ మార్పు వెనుక రఘునాథ్ రావు హస్తం ఉందని ఇదే విషయమై పలుమార్లు ఢిల్లీకి వెళ్లాడని ఆరోపించారు. మంచిర్యాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కృషి చేస్తుంటే బీఆరెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై తప్పుడు విమర్శలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.