14-04-2025 10:27:39 PM
కాకా కుటుంబం కాంగ్రెస్ కు ఎప్పుడు నష్టం చేయలేదు..
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమీ తెలియదని, కాకా కుటుంబం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ చిన్న నష్టం కూడా తలపెట్టలేదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్పారు. సోమవారం రాత్రి బెల్లంపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఇచ్చేది పూర్తిగా అధిష్టానమేనని స్పష్టం చేశారు. తమ కుటుంబంపై ఏదైనా ఫిర్యాదు చేయదలిస్తే ప్రేమ్ సాగర్ రావు హై కమాండ్ దృష్టికి తెలపాలన్నారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీని కాపాడింది మాజీ మంత్రి కాకా కుటుంబమేనని గుర్తు చేశారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గత 20 ఏళ్ల నుండి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని, కాక తో పాటు ఆయన వారసులుగా తాము 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నామని స్పష్టం చేశారు. తాను గాని, తన సోదరుడు వివేక్ వెంకటస్వామిగాని కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏ చిన్న నష్టం కూడా తలపెట్టలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కాకా కుటుంబం పట్టేదారు అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసిన విషయాన్ని వినోద్ స్పష్టం చేశారు. పార్టీకి తమ కుటుంబం చేసిన సేవని, పార్టీలో తమ కుటుంబానికి ఉన్న సీనియార్టీని అధిష్టానానికి చెప్పుకున్నామే తప్ప మేము ఎప్పుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోసం మాట్లాడలేదని చెప్పారు.
తనపై, తన తమ్ముడు వివేక్ వెంకటస్వామి పై, తమ కుమారుడు వంశీకృష్ణ పై ప్రేమ్ సాగర్ రావు కామెంట్ చేయడం సరైనది కాదని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం తాము పని చేశామే తప్ప కాంగ్రెస్ పార్టీకి నష్టం తలపెట్టలేదని తెలిపారు. కాక కుటుంబం పై మాట్లాడే నైతిక అర్హత ప్రేమ్ సాగర్ రావుకు ఎంత మాత్రం లేదని తేల్చి చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి ప్రేమ్ సాగర్ రావు కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించింది కూడా తామేనని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ అధ్యక్షులు ఎం .సూరిబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, ఎండి ఈసా, రత్నం ప్రదీప్, కంకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.