మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఆళ్లపల్లి, గుండాల మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ, సమాచారం శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాయం పర్యటించి మంత్రులు చేపట్టబోయే కార్యక్రమాలను పరిశీలించారు. ఇందులో భాగంగా గుండాల మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులను పాఠశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను, అంగన్వాడీ నిర్వాహకులను వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.
గుండాల మండలం చిన్న వెంకటాపురం నుంచి మల్లెల గుంపు గ్రామాల మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. నిర్మాణ క్రమంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆళ్లపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పాయం ఇటీవల మృతి చెందిన పెండకంటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో గుండాల తాసిల్దార్ ఇమ్మానుయేల్, ఎంపీడీవో సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, మండల అధ్యక్షుడు ముత్యమాచారి, నాయకులు దారా అశోక్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.