మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామపంచాయితీ పరిధిలోని పోతిరెడ్డి పల్లి, ప్రభుత్వ పాఠశాలలో, జానంపేట పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి గ్రామ సభలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామసభలలో ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించాలని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును అందిస్తామన్నారు.
గ్రామ సభల్లో దరఖాస్తు ఇచ్చిన ప్రజలు ప్రస్తుతం ఈ నెల 26 నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాకపోతే ఎవరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. వారి కోసం మళ్లీ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నాలుగు రోజులు పాటు విడతల వారీగా ఆయా గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే వారిలో నిజమైన అర్హులు ఉంటే వారికి వెంటనే పథకాలను అందించడం జరుగుతుందన్నారు. రెచ్చగొట్టే మాటలను ఈ ప్రభుత్వం పట్టించుకోదని చిత్తశుద్ధితో పనిచేయడమే ఈ ప్రభుత్వానికి తెలుసన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని హామీ నిచ్చారు. గ్రామ సభల్లో పినపాక MRO అద్దంకి నరేష్, ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరావు, ఏడిఏ తాతారావు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు