మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో ప్రజా పాలన గ్రామసభలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) మంగళవారం ప్రారంభించారు. తొలుత మండలంలోని ఇప్పల సింగారం గుట్ట మల్లారం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభలను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామసభలలో ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించాలని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును అందజేయడమే తమ లక్ష్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రజలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఈనెల 26న అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని, దరఖాస్తు చేసుకొని వారు గ్రామసభల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నిజమైన అర్హులను గుర్తించే విషయంలో స్థానిక ప్రజలు ప్రభుత్వ అధికారులకు సహకరించి పథకాల అమలులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తాహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడిఓ శ్రీనివాస్ రావు, MEO స్వర్ణజ్యోతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, నీలకంఠేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు, పార్టీ మండల నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.