ఫసల్ బీమా యోజన అమలు చేస్తేనే రైతులకు ప్రయోజనం
వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటన
ఆదిలాబాద్, (విజయక్రాంతి): భారీ వర్షాల వల్ల ఆదిలాబాద్ లోని పెన్ గంగా నది పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిందని, పంట నష్టంపై ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన జైనథ్, బేల మండలాల్లోని వరద తాకిడి ప్రాంతాలను సోమవారం ఎమ్మెల్యే సందర్శించి, రైతులకు భరోసా కల్పించారు. పెన్ గంగా నది పరివాహక ప్రాంతాలైన అనంద్ పూర్, కూర, గ్రామాలను సందర్శించి పంట నష్టం వివరాలపై ఆరా తీశారు.
నీట మునిగిన పంటలను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. చేతికి వచ్చే దశలో పత్తి, సోయాబీన్ ఇతర పంటలు వరద నీటిలో మునిగి అపార నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వైపరీత్యాలపై తక్షణమే సర్వే నిర్వహించి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించాలన్నారు. ఒక్కో ఎకరానికి రూ.40 వేల చొప్పున రైతు పెట్టుబడి పెట్టారని, వారికి ప్రభుత్వం అండగా నిలవలసిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరి పంట విపత్తుపై నష్టపరిహారం అందించాలని కోరారు.