22-02-2025 09:13:16 PM
నీళ్లపై కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదు..
ప్రభుత్వంతో మాట్లాడి 15 మోటార్లు ఆన్ చేయించా..
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
జనగామ,(విజయక్రాంతి): లిఫ్ట్ మోటార్లు బంద్ అయి నీళ్లు లేక రైతుల పొలాలు ఎండుతుంటే అధికార పార్టీ నాయకులు వేడుక చూస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేటర్లు బిల్లుల రాక మోటార్లను బంద్ చేయిస్తే కనీసం ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పటించలేని స్థితిలో అధికార పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. తాను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy)తో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మాట్లాడి మోటార్లను ఆన్ చేయించానని పల్లా స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా ధర్మసాగర్ కు, అక్కడి నుంచి గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్ట్ చేయాల్సిన మోటార్లను ఆపరేటర్లు 15 రోజులుగా బందు చేశారన్నారు.
అయినా అధికార పార్టీకి మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా చేష్టలుడిగినట్లు కూర్చున్నారన్నారు. తాను జనగామ ఎమ్మెల్యేగా ఈఎన్సీ అనిల్ కుమార్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆపరేటర్లకు బకాయిలు చెల్లించేలా కృషి చేసినట్లు తెలిపారు. దీంతో మోటార్లను ఆన్ చేశారన్నారు. ధర్మసాగర్ నుంచి గండిరామారం రావాల్సిన లైనులో ఔట్లెట్లు ఉన్న అన్ని ప్రాంతాల్లో నీళ్లు వెళ్తున్నాయన్నారు. మిగతా నీరు గండిరామారం రిజర్వాయర్ కు, అక్కడి నుంచి బొమ్మకూరు, కన్నెబోయిన గూడెం, వెల్దండ, లద్నూర్, తపాస్పల్లి రిజర్వాయర్లను నింపాల్సి ఉందని చెప్పారు. దీంతో జనగామ నియోజకవర్గం 80 శాతం ఆయకట్టుకు నీళ్లు అందుతాయన్నారు. ప్రస్తుతం అన్ని ఊర్లల్లో నీళ్లు లేక పంటలు పశువుల మేతకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల మధ్య కడియం చిచ్చు..
మోటార్లను ఆన్ చేయగానే గండిరామారం రిజర్వాయర్ దగ్గరకు కడియం శ్రీహరి వచ్చారని, ఇన్ని రోజులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదని పల్లా విమర్శించారు. రైతుల మధ్య చిచ్చు పెట్టి చిల్లర రాజకీయాలకు ఆయన తెర లేపుతున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల రైతుల పొలాలకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. లేదంటే రైతుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.